కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నీటిపారుదల పథకం (Palamuru-Rangareddy Lift Irrigation Scheme) పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. శుక్రవారం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం ఉదండాపూర్ రిజర్వాయర్‌ను సందర్శించిన సీఎం, అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ, మ్యాపులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన ట్రంక్‌లో ఉదండాపూర్ (Udandapur) జలాశయం కీలక భాగంగా ఉంది. ఈ జలాశయానికి సంబంధించిన పనులు ప్యాకేజీ–16, 17, 18ల కింద కొనసాగుతున్నాయి. మొత్తం రూ.7,802.91 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులలో ఇప్పటివరకు రూ.5,126.59 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. అంటే మొత్తం పనులలో 65.70 శాతం పురోగతి నమోదైంది. అధికారుల వివరాల ప్రకారం, మిగిలిన రూ.2,675.91 కోట్ల విలువైన పనులను పూర్తి చేసి 2027 జూలై నాటికి ఉదండాపూర్ జలాశయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ జలాశయం, దక్షిణ ప్రధాన కాలువతో కలిపి సుమారు 9,36,685 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ప్యాకేజీ–16లో రూ.4,315.32 కోట్ల పనులకు గాను 70.50 శాతం పనులు పూర్తయ్యాయి. ప్యాకేజీ–17లో రూ.736.08 కోట్ల పనుల్లో 68.16 శాతం పనులు పూర్తయ్యాయి. ప్యాకేజీ–18లో రూ.2,751.51 కోట్ల పనుల్లో 57.13 శాతం పనులు పూర్తైనట్లు అధికారులు సీఎంకు వివరించారు. పనుల పురోగతిని సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి, మిగిలిన పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భూసేకరణ, నిర్మాణ పనులలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, సంపత్ కుమార్, కాసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా అధికారులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

