కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ పోలీసులు అరుదైన ఘనత సాధించారు. ఫిర్యాదుల నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు, భాషా సమస్యలను అధిగమించడానికి కొత్తగా ‘ఏఐ కాప్‌రైటర్’ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశంలోనే తొలి బహుభాషా ఏఐ ఆధారిత ఫిర్యాదు నమోదు వ్యవస్థగా ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది.
80 పోలీస్ స్టేషన్లలో ప్రయోగాత్మకంగా వినియోగం
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో శనివారం ఈ యాప్‌ను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. నగరంలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో దీన్ని వినియోగంలోకి తీసుకురానున్నారు. యాప్ పనితీరును ఆయన పరిశీలించారు. ఈ యాప్ ద్వారా బాధితులు తమ మాతృభాషలో చెప్పే ఫిర్యాదులను తక్షణమే టెక్స్ట్ రూపంలోకి మార్చి, అవసరమైన భాషలోకి అనువదించి పోలీసులకు అందిస్తుంది. హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి 10కి పైగా భారతీయ భాషలను ఇది గుర్తించగలదు. భాషా పరమైన ఇబ్బందుల కారణంగా ఫిర్యాదుల నమోదు ఆలస్యం కావడం లేదా తప్పుగా నమోదు కావడం వంటి సమస్యలకు ఇది పరిష్కారం చూపనుంది.
సెకన్లలోనే ఫిర్యాదు ప్రక్రియ పూర్తి
ఫిర్యాదు నమోదు ప్రక్రియను సెకన్లలోనే పూర్తి చేయడం ఈ యాప్ ప్రత్యేకత. ఫిర్యాదు రికార్డైన అధికారి వివరాలు, సమయం వంటి అంశాలు ఆటోమేటిక్‌గా నమోదు కావడంతో పారదర్శకత పెరుగుతుందని అధికారులు తెలిపారు. అవసరమైతే ఫిర్యాదు పీడీఎఫ్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది. మల్టీ-పార్టీ లేబులింగ్ వ్యవస్థను ఇందులో పొందుపరిచారు. దీనివల్ల బాధితుడు, నిందితుడు, సాక్షులు చెప్పే విషయాలను వేరువేరుగా గుర్తించి రికార్డు చేయవచ్చు. ప్రతి ఐదు సెకన్లకు ఒకసారి సమాచారం అప్‌డేట్ అయ్యే విధంగా వ్యవస్థను రూపొందించారు. హైదరాబాద్ సిటీ పోలీస్‌తో పాటు బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సంస్థ ఈ యాప్ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యింది. వలస కార్మికులు, మహిళలు, వృద్ధులు వంటి వర్గాలకు పోలీస్ సేవలు మరింత సులభతరం చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఏఐని విస్తృతంగా వాడుతున్న పోలీస్‌శాఖ
పోలీసింగ్ వ్యవస్థలో కృత్రిమ మేధను విస్తృతంగా ఉపయోగిస్తున్న హైదరాబాద్ సిటీ పోలీసులు ఇప్పటికే సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం ‘సి-మిత్ర’, సోషల్ మీడియా పర్యవేక్షణ కోసం ‘సాక్-ఐ’ వంటి ఏఐ ఆధారిత వ్యవస్థలను వినియోగిస్తున్నారు. తాజా యాప్‌తో ఫిర్యాదుల నమోదు ప్రక్రియ కూడా పూర్తిగా డిజిటల్, వేగవంతం అయ్యిందని అధికారులు పేర్కొన్నారు.

