సోషల్ మీడియాపై నిఘా.. సరికొత్త అస్త్రాన్ని ప్రారంభించిన HYD పోలీస్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో సోషల్ మీడియాలో విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపేందుకు సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్ -సాక్ ఐ (SOCEYE System) పేరుతో సరికొత్త కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్‌ను సిటీ పోలీస్ ఐటీ విభాగం (Hyderabad Police) ప్రారంభించింది. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆన్‌లైన్ వేదికలపై తప్పుడు ప్రచారాలు చేసే వారిని పసిగట్టడంతో పాటు, అసాంఘిక శక్తుల కదలికలను ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు ఈ అత్యాధునిక వ్యవస్థను రూపొందించింది. గతంలో సోషల్ మీడియా పర్యవేక్షణకు భారీగా సిబ్బంది అవసరమయ్యింది. అలాగే గంటల తరబడి మాన్యువల్‌గా శ్రమించాల్సి వచ్చేది. ఈ సమస్యలను పరిగణించిన పోలీస్ విభాగం సరికొత్త ఏఐ ఆధారిత అప్లికేషన్ తో ముందుకు వచ్చింది.

ప్రయోగాత్మక దశలోనే అద్భుతమైన విజయం..

‘సాక్ ఐ’ (SOCEYE System) ద్వారా ఇకపై అన్నీ ఆటోమేటెడ్‌ పద్ధతిలో నిరంతరాయంగా జరుగుతాయి. దీనిలోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ డ్యాష్‌బోర్డ్ ద్వారా డయల్ 100 కాల్స్, అంతర్గత నిఘా సమాచారం, నగరంలో జరుగుతున్న ప్రధాన ఘటనల వివరాలను ఒకే చోట క్రోడీకరించి అధికారులకు పూర్తి స్థాయి క్షేత్రస్థాయి అవగాహన కల్పిస్తుంది. సాక్ ఐ తన ప్రయోగాత్మక దశలోనే అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పురానాపూల్ ఎక్స్ రోడ్ ఘటనకు సంబంధించి 85 ద్వేషపూరిత, మతపరమైన సున్నితమైన అంశాలను, అలాగే గుడిమల్కాపూర్ వివాదానికి సంబంధించి పలు సోషల్ మీడియా ఖాతాలలో ఉన్న 126 పోస్ట్‌లను ఇది గుర్తించింది. ఇటువంటి కంటెంట్‌ను సకాలంలో తొలగించేలా తక్షణ చర్యలు చేపట్టడం ద్వారా శాంతి సామరస్యాలను కాపాడటమే కాకుండా, విద్వేషాలను రేకెత్తించే వారిని గుర్తించడం సాధ్యమైంది.

డ్రగ్స్, చిన్నారులు, మహిళల భద్రతపై దృష్టి..

ప్రత్యేకించి మాదకద్రవ్యాల సరఫరా, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ వ్యవస్థ దృష్టి పెడుతుంది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్, సైబర్ బుల్లింగ్, స్టాకింగ్ వంటి అంశాలను ఏఐ మోడల్స్ స్వయంగా గుర్తించి అప్రమత్తం చేస్తాయి. ప్రతి ఫిర్యాదుకు ఒక యూనిక్ ట్రాకింగ్ నంబర్ కేటాయించి, అది పరిష్కారమయ్యే వరకు ఎండ్-టు-ఎండ్ మానిటరింగ్ చేస్తుంది. నేర పరిశోధనలో కీలకంగా మారిన SOCMINT, OSINT వంటి ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఇందులో అంతర్భాగంగా ఉండటంతో సైబర్ కేసుల ఛేదన సులభతరం కానుంది.

ఈ ‘సాక్ ఐ’ వ్యవస్థ పోలీసుల పనిభారాన్ని తగ్గించడమే కాకుండా, నేర నివారణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలో అశాంతిని రేకెత్తించే శక్తుల ఆటకట్టించేందుకు, మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ ఏఐ వ్యవస్థను రూపొందించామని వివరించారు.

Read Also: తెలంగాణ పోలీస్ అధికారులకు అమిత్ షా సన్మానం

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>