కలం, కరీంనగర్ బ్యూరో : బలహీనవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. కరీంనగర్ ఇందిరా గార్డెన్స్ లో రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి కి అభినందన సభ నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఆయనను అభినందించి సత్కరించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 1986-87లో డిగ్రీ కాలేజీ రాజకీయాల్లో ఉన్నప్పుడు బొమ్మ వెంకన్న, సత్యనారాయణ రావు, వెంకట్ స్వామిలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒక పిల్లర్ లాగా ఉన్నారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల నాయకత్వం మరింత పటిష్ఠంగా ఉండేలా బొమ్మ శ్రీరామ్ కి జిల్లాలో మంచి అవకాశం వచ్చిందన్నారు. గత 10 సంవత్సరాలుగా సంక్షేమ శాఖ నిర్వీర్యం అయిపోయిందని, భవనాల కిరాయి కట్టలేక మెస్ బకాయిలు చెల్లించే పరిస్థితి లేని పరిస్థితి నెలకొందని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎప్పటికప్పుడు గ్రీన్ కారిడార్ ద్వారా అద్దెలు, మెస్ ఛార్జీలు చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్య బలోపేతం చేయాలని, ఉన్నత చదువులు చదివిన కుటుంబమే ఉన్నత స్థాయిలో ఉన్నాయని సర్వే లో తేలిందన్నారు. త్వరలోనే బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచే కార్యక్రమంలో కోర్టుల వద్ద ఆగిపోయాయని, కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని తెలిపారు. గత ప్రభుత్వంలో కుల స్థలాలు మాత్రమే కేటాయించారని, త్వరలోనే కుల భావనలకు నిధులు కేటాయించి జ్యోతి బాపులే ఆత్మగౌరవ భవనాలుగా పూర్తి చేస్తామని హామినిచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొంత ఇబ్బంది అయినప్పటికీ జిల్లాల్లో అన్ని మున్సిపాలిటీ లు కైవసం చేసుకున్నామన్నారు. గ్రామ స్థాయి నుండి పార్టీ పటిష్ట పరిచేలా చర్యలు తీసుకుందామని పిలుపునిచ్చారు. సమాజంలో వెనుకబడ్డ పేదలకు సహాయం చేసే విధంగా కార్యాచరణ ఉండాలన్నారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ధాన్యం కొనుగోలు, ఇరిగేషన్‌లో జిల్లా అగ్రగామిగా ఉండేలా పనిచేస్తామని, ప్రజా పాలన ప్రభుత్వం లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఒడితల ప్రణవ్, కర్ర రాజశేఖర్, అల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్‌లు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్ లు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: పొంగులేటి భావోద్వేగం.. ‘మోదీతో నాటి ప్రయాణం ఓ మధురానుభూతి!’
Follow Us On: WhatsApp

