తెలంగాణ పోలీస్ అధికారులకు అమిత్ షా సన్మానం

కలం, క్రైమ్ బ్యూరో : తెలంగాణలో నక్సలిజాన్ని సమూలంగా అణచివేసి, రాష్ట్రాన్ని నక్సల్స్ రహితంగా తీర్చిదిద్దడంలో ప్రతిభ కనబరిచిన తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులను కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సన్మానించారు. సోమవారం ఆయన ఛత్తీస్‎గఢ్‎లోని బస్తర్ జిల్లాలో పర్యటించారు. జగదల్పూర్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో మావోయిస్టుల నిర్మూలనకు కృషి చేసిన పోలీస్ అధికారులను సన్మానించారు. ఈ సంధర్భంగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, రాష్ట్ర భద్రత సలహాదారు, మాజీ డీజీపీ బి.శివధర్ రెడ్డి, ఆక్టోపస్ అండ్ గ్రేహౌండ్స్ అపరేషన్స్ డీజీపీ అనిల్ కుమార్, మల్కాజ్‎గిరి సిపి, మాజీ ఎస్ఐబీ ఐజి సుమతీతో పాటు ఆమె నేతృత్వంలోని బృందాన్ని అమిత్ షా సత్కరించి సేవలను షా అభినందించారు.

ఈ సందర్భంగా అమిత్ షా (Amit Shah) మాట్లాడుతూ.. దేశాన్ని పట్టిపీడిస్తున్న వామపక్ష తీవ్రవాదానికి ముగింపు పలికి, నక్సలిజం రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని అన్నారు. 2024 జనవరిలో జరిగిన అంతర్గత సమావేశంలో 31 మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని తాము కాలపరిమితిని నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. “మేం ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది ప్రైవేట్ చర్చల్లో ఇది సాధ్యం కాదంటూ సందేహాలు వ్యక్తం చేశారు. కానీ మేం స్పష్టమైన ప్రణాళికతో, పక్కా వ్యూహంతో ముందుకు సాగాం. దంతేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఈ రోజు బస్తర్ (Bastar) ప్రాంతాన్ని నక్సల్స్ రహితంగా ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంది” అని అమిత్ షా పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్ ఇప్పుడు నక్సలిజం మహమ్మారి నుంచి విముక్తి పొందిందని, వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా సాగిన సుదీర్ఘ పోరాటంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయి అని ఆయన కొనియాడారు. 1970వ దశకం నుంచి 31 మార్చి 2026 వరకు దాదాపు మూడు తరాల పాటు దేశ ప్రజలు నక్సలిజం అనే ఒక పీడకలను చవిచూశారని అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర రక్తపాతం, అభివృద్ధి నిలిచిపోవడం, యువత భవిష్యత్తు అంధకారమవ్వడం వంటి పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు.

నక్సలిజం నిర్మూలన పోరాటంలో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన జవాన్లు ప్రాణత్యాగం చేశారని, వారి బలిదానాల వల్లే నేడు ఈ విజయం సాధ్యమైందని హోం మంత్రి అన్నారు. నక్సలిజం కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన సమస్య కాదని, తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌తో పాటు దేశవ్యాప్తంగా దీనిపై ఆందోళన ఉండేదన్నారు. ఒక జీవిత కాలంలో సాధించలేమనుకున్న అసాధ్యమైన లక్ష్యాన్ని, భద్రతా దళాల సమన్వయం మరియు పట్టుదలతో సాకారం చేశామని అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు.

Read Also:  అమెరికా ప్రయాణానికి ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు సిద్ధం

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>