కలం, వెబ్ డెస్క్ : ఆర్టీసీ సమ్మె (TGSRTC Strike) నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు మెట్రో రైలు (Hyderabad Metro) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో రవాణా వ్యవస్థపై ఒత్తిడి పెరగడంతో మెట్రో సర్వీసులను పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇకపై ప్రతి నాలుగు నిమిషాలకో మెట్రో రైలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సమ్మె కాలంలో మొత్తం 56 మెట్రో రైళ్లను నిరంతరాయంగా నడపాలని అధికారులు నిర్ణయించారు.
మియాపూర్ నుండి ఎల్బీనగర్ మార్గంలో ప్రతి 4 నిమిషాల 20 సెకన్లకు ఒక రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా నాగోల్ నుంచి రాయదుర్గం కారిడార్‌లో ప్రతి 3 నిమిషాల 40 సెకన్లకు ఒక సర్వీసును నడపనున్నట్లు మెట్రో ఉన్నతాధికారులు వెల్లడించారు. సాధారణంగా రద్దీ లేని సమయంలో రైళ్ల సంఖ్యను తగ్గించేవారు కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రోజంతా ఒకే వేగంతో సర్వీసులను కొనసాగించనున్నారు.
గతంలో కేవలం పీక్ అవర్స్‌లో మాత్రమే నడిచే 56 రైళ్లను ఇప్పుడు రోజంతా నడపడం ద్వారా రవాణా ఇబ్బందులు తగ్గుతాయని భావిస్తున్నారు. సాధారణ రోజుల్లో నాన్-పీక్ అవర్స్‌లో రైళ్ల సంఖ్యను 44కు తగ్గించేవారు, కానీ సమ్మె కారణంగా ఆ తగ్గింపును రద్దు చేశారు. దీనికి తోడు, అర్థరాత్రి 11 గంటల తర్వాత కూడా మెట్రో సేవలను పొడిగించే అంశాన్ని ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ పరిశీలిస్తోందని హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro) ఎండీ స్పష్టం చేశారు.
Read Also: నాదెండ్ల భాస్కరరావు ఇక లేరు!
Follow Us On: Sharechat

