కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (Nadendla Bhaskara Rao) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వయో సంబంధిత సమస్యలతో కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. నాదెండ్ల భాస్కర రావు వయసు 90 సంవత్సరాలు. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, అభిమానులు అంతిమ నివాళులు అర్పించుకోవడానికి వీలుగా ఆయన పార్థివ దేహాన్ని జూబిలీహిల్స్ లోని ఆయన నివాసంలో ఉంచనున్నారు. హైదరాబాద్ లోని పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో తన అంత్యక్రియలు నిర్వహించాలని గతంలో నాదెండ్ల భాస్కర రావు కుటుంబ సభ్యులకు సూచించారు. ఆయన ఆకాంక్ష మేరకు గురువారం మధ్యాహ్నం 4 గంటలకు పంజాగుట్ట, హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

