కలం, వెబ్ డెస్క్: కార్పొరేట్ ఉద్యోగం, సమాజంలో హోదా కంటే మనసుకు నచ్చిన పనిచేయడంలో అసలైన ఆనందం ఉంటుందని నిరూపిస్తున్నాడు ఈ హైదరాబాదీ. నగరానికి చెందిన కుమార్ అనే వ్యక్తి గతంలో అమెజాన్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగం (Amazon Job) చేశాడు. దాన్ని వదిలేసి తనకు నచ్చిన డ్రైవింగ్ వృత్తిని ఎంచుకున్నాడు. ఈ విషయం చేతనా సింగ్ అనే సాఫ్ట్‌వేర్ డెవలపర్ ద్వారా వెలుగులోకి వచ్చింది. కుమార్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె అతనితో మాట్లాడి, ఆ సంభాషణను రికార్డ్ చేసింది. ఇన్‌స్టాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
హైదరాబాద్‌లో 2014లో ఉబెర్ సేవలు ప్రారంభమైన కొత్తలోనే కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి డ్రైవర్‌గా చేరాడు. పదేండ్లుగా సాగుతున్న ఈ ప్రయాణంలో అతడు దాదాపు 23,600 ట్రిప్పులను విజయవంతంగా పూర్తి చేశాడు. నగరంలోనే అత్యధిక రేటింగ్ ఉన్న డ్రైవర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. తనకు ఈ ఉద్యోగం ఎంతో తృప్తిని ఇస్తోందని, ప్రతిరోజూ కొత్త వ్యక్తులను కలవడం, వారి కథలను వినడం, తన సొంత నగరమైన హైదరాబాద్‌ను మరింతగా అన్వేషించడం ఇష్టమని కుమార్ చెప్తున్నాడు.
సామాజిక ఒత్తిళ్లు, బాధ్యతల కారణంగా చాలామంది తమకు నచ్చిన వ్యాపకాలను వదిలేస్తున్న ఈ రోజుల్లో కుమార్ తీసుకున్న నిర్ణయం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. జీవిత సంతృప్తి అనేది కేవలం పెద్ద పెద్ద ఉద్యోగాలు, హోదాల వల్ల మాత్రమే రావని కుమార్ నిరూపించాడంటూ అభినందిస్తున్నారు. రొటీన్ జీవితంలో ఇరుక్కుపోయి సతమతమవుతున్న వారికి ఇతని ప్రయాణం గొప్ప పాఠమని చెప్తున్నారు.
Read Also: వాటర్ బార్ కల్చర్.. లీటర్ నీళ్లకు వేల రూపాయలు!
Follow Us On: Instagram

