కలం, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి ముఖానికి మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు కానీ.. బీఆర్‌ఎస్‌ను మొలకెత్తనీయనని డైలాగులు కొడుతున్నాడని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేస్తానని రేవంత్ అన్నాడని.. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కాలే కానీ, ఎనుముల వారి నలుగురు అన్నదమ్ములు మాత్రం కోటీశ్వరులయ్యారని దుయ్యబట్టారు. నేడు ఎనుముల కుటుంబం కడుపు నిండిందని.. మహిళలు, పేదలు, రైతులు కడుపు మాత్రం ఎండుతోందని మండిపడ్డారు.
ఎందుకు 5 వేల ఉద్యోగాలే నింపుతున్నాడు?
తాము రైతు భరోసా (Rythu Bharosa) సంవత్సరానికి రూ.12,000 ఇస్తామని మూడు బడ్జెట్లలో చెప్పారని.. బడ్జెట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చదువుడు, వీళ్లు బల్లలు కొట్టుడు, పైసలు మాత్రం ఒక్క రూపాయి కూడా రావు అంటూ దుయ్యబట్టారు. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఏడాదికి రూ.12,000 ఇస్తామన్నారని.. ఏ కూలీకి కూడా ఒక్క రూపాయి వచ్చిన పరిస్థితి లేదని చెప్పారు. కొత్త డీజీపీ సీవీ ఆనంద్ పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు ఉన్నాయని అన్నాడని.. రేవంత్ రెడ్డి ఏమో కేవలం 5 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ 17 వేల ఖాళీలు ఉంటే 17 వేలకు నోటిఫికేషన్లు ఇచ్చాడని.. మరి రేవంత్ రెడ్డి ఎందుకు 5 వేల ఉద్యోగాలే నింపుతున్నాడు? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు పరీక్షల ఫీజు ఫ్రీ అన్నాడని.. ఇప్పుడు రూ.400 ఫీజు ఉంటే వాటిని రూ.800 చేశాడని ఫైర్ అయ్యారు.
గుడ్లు, పప్పులో రూ.2,000 కోట్ల స్కామ్..
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో రూ.2,000 కోట్ల స్కామ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో ఎవరైనా స్కామ్ చేస్తారా? అని మండిపడ్డారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ తనకు ఛాలెంజ్ విసురుతున్నారని చెప్పారు. చికెన్ కోసం రూ.800 కోట్ల టెండర్ పిలిచారని.. రెండు కలిపితే రూ.2000 కోట్లు అవుతుందన్నారు. టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే కాంగ్రెస్ నేతలు ఏం పాలన చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. ఎంత కొన్నారో, ఎంత టెండర్లు పిలిచారు తెలియలేదు అంటే తమ విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రే మొత్తం టెండర్లు పిలిచి అనుముల అన్నా తమ్ముళ్లు మొత్తం మింగుతున్నారని.. అందుకే మంత్రులకు ఏమీ తెలియదు అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: దేశానికి ఎల్ నినో టెర్రర్.. లోటు వర్షపాతం!
Follow Us On: Sharechat

