కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం డివిజన్ పరిధిలోని టేకులపల్లి (Tekulapalli) కేసీఆర్ టవర్ ప్రాంతంలో గంజాయి సేవిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు శనివారం ఆకస్మిక తనిఖీలు (Police Raids) నిర్వహించారు. సీఏఆర్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, సీసీఎస్, ఈగల్ ఫోర్స్, క్లూస్ టీమ్‌లకు చెందిన 286 మంది పోలీసులు ఏకకాలంలో రంగంలోకి దిగి 52 బ్లాక్‌లలోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు.
రైడ్స్‌లో ఇద్దరు గంజాయి వ్యాపారులు, 12 మంది గంజాయి సేవించే వ్యక్తులను గుర్తించి 50 గ్రాముల పొడి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే సరైన ధ్రువపత్రాలు లేని 62 బైకులు, 5 ఆటోలతో పాటు ముగ్గురు నిందితులు, ఇద్దరు అనుమానితులను గుర్తించారు. 105 మంది వేలిముద్రలు సేకరించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (CP Sunil Dutt) మాట్లాడుతూ.. నేరరహిత సమాజమే ధ్యేయంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ప్రజలు స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అపరిచితులు లేదా అద్దెదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు, సీఐలు, ఆర్ఐలు పాల్గొన్నారు.
Also Read : క్లాస్‌రూమ్‌లో కిరాతకం: ఇటుక, ఫ్లవర్ పాట్‌తో చిన్నారిపై దాడి!
Follow Us On : WhatsApp

