Mobile Popup Ad
Mobile Popup Ad

వాట్సాప్ వెబ్‌లో బిగ్ అప్‌డేట్.. ఇక బ్రౌజర్ నుంచే గ్రూప్ కాల్స్!

కలం, వెబ్‌డెస్క్: వాట్సాప్ వెబ్ (WhatsApp Web) అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ యొక్క డెస్క్‌టాప్ వెర్షన్. మీ మొబైల్ ఫోన్ స్క్రీన్‌కే పరిమితం కాకుండా, కంప్యూటర్ లేదా లాప్‌టాప్ బ్రౌజర్‌లో వాట్సాప్‌ను నేరుగా వాడుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఆఫీస్ ఉద్యోగులు, విద్యార్థులు సిస్టమ్ ముందు కూర్చుని పని చేసుకునేటప్పుడు, ప్రతిసారీ ఫోన్ తీసే అవసరం లేకుండా కీబోర్డ్ ద్వారా వేగంగా మెసేజ్‌లు పంపుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సాధనం.

వాట్సాప్ తన వినియోగదారుల కోసం నిరంతరం సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే వాట్సాప్ వెబ్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు ఆ సంస్థ ఒక కీలకమైన అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. తాజా నివేదికల ప్రకారం.. కొంతమంది ఎంపిక చేసిన బీటా వినియోగదారుల కోసం వాట్సాప్ వెబ్‌లో గ్రూప్ వాయిస్ కాల్స్, గ్రూప్ వీడియో కాల్స్, స్క్రీన్ షేరింగ్, కాల్ లింక్ వంటి అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నారు.

ఇప్పటివరకు వాట్సాప్ బ్రౌజర్ వెర్షన్ కేవలం ఒకరితో ఒకరు కాల్స్ చేసుకోవడానికి మాత్రమే పరిమితమై ఉండేది. కానీ, ఈ సరికొత్త అప్‌డేట్ ద్వారా వినియోగదారులు ఎలాంటి అదనపు యాప్స్ లేకుండా, నేరుగా తమ వెబ్ బ్రౌజర్ నుంచే గ్రూప్ కాల్స్ మాట్లాడుకోవచ్చు.

ఆఫీస్ వర్క్, ఆన్‌లైన్ సమావేశాలు, లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాటింగ్ చేసేందుకు వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించే వారికి ఈ ఫీచర్ ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు టెక్ నిపుణులు. ఇప్పటి వరకు గ్రూప్ వీడియో కాల్ సెల్‌ఫోన్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇకపై వాట్సాప్ వెబ్ లో కూడా గ్రూప్ వీడియో కాల్ అందుబాటులోకి రానుంది.

వాట్సాప్ వెబ్‌లో ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుంది..?

ఒకవేళ మీ ఖాతాలో ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంటే గ్రూప్ చాట్‌లో కాల్ బటన్ కనిపిస్తుందట. ఈ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా వాయిస్ లేదా వీడియో కాల్ మధ్య ఎంచుకోవచ్చు. ఈ గ్రూప్ కాల్‌లో అవసరాలను బట్టి మీరు ఎంచుకున్న వ్యక్తులను మాత్రమే జోడించే అవకాశం ఉంది.

ఒకేసారి 32 మందితో గ్రూప్ కాల్

వాట్సాప్ వెబ్‌లో రాబోతున్న ఈ సరికొత్త గ్రూప్ కాలింగ్ ఫీచర్‌లో ఒకేసారి గరిష్టంగా 32 మంది వరకు పాల్గొనవచ్చు. ప్రస్తుతం వాట్సాప్ మొబైల్ యాప్ అలాగే డెస్క్‌టాప్ యాప్‌లలో ఉన్న కాలింగ్ పరిమితినే ఇప్పుడు వెబ్ బ్రౌజర్ వెర్షన్‌కు కూడా విస్తరించారు. దీనివల్ల వినియోగదారులు మొబైల్ వాడుతున్నా లేదా కంప్యూటర్ వాడుతున్నా.. అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో ఒకే విధమైన (కన్సిస్టెంట్) కాలింగ్ అనుభవాన్ని పొందుతారు.

కాల్ లింక్‌తో ఈజీ జాయినింగ్

ఈ సరికొత్త అప్‌డేట్‌లో వాట్సాప్ వెబ్ కాల్ లింక్ (Call Link) ఫీచర్‌ను కూడా యూజర్లకు పరిచయం చేస్తోంది. దీని ద్వారా వినియోగదారులు ఒక ప్రత్యేకమైన కాల్ లింక్‌ను క్రియేట్ చేసి ఇతరులతో పంచుకోవచ్చట. అవతలి వారు కేవలం ఆ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఎలాంటి శ్రమ లేకుండా నేరుగా కాల్‌లో జాయిన్ అవ్వవచ్చు.

వీడియో కాల్స్‌లో స్క్రీన్ షేరింగ్

దీనితో పాటు, వీడియో కాల్స్ మాట్లాడుకునేటప్పుడు స్క్రీన్ షేరింగ్ (Screen Sharing) చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు. ఈ ఫీచర్ సహాయంతో ఆఫీస్ మీటింగ్‌లలో ప్రజెంటేషన్‌లు, ముఖ్యమైన డాక్యుమెంట్‌లు, వెబ్‌సైట్‌లు లేదా ఇతర కంటెంట్‌ను కాల్‌లో ఉన్న మిగిలిన వారందరికీ మీ కంప్యూటర్ స్క్రీన్ ద్వారా నేరుగా చూపించవచ్చు. ఈ ఫీచర్లు ఆఫీస్ ఉద్యోగులకు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి.

భద్రతకు కూడా ప్రాధాన్యత

గ్రూప్ కాల్స్, వీడియో కాల్స్, స్క్రీన్ షేరింగ్ సమయంలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అమలులో ఉంటుందని వాట్సాప్ ధృవీకరించింది. అంటే మీ సంభాషణలు, షేర్ చేసిన డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>