ఫొరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై డీజీ విక్రమ్ సింగ్ అత్యవసర సమీక్ష

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నాంపల్లిలోని (Nampally) ఫొరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో శనివారం భారీ అగ్ని ప్రమాదం (Forensic Lab Fire)  చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పలు కీలక కేసులకు సంబంధించిన ఆధారాలు ఈ ప్రమాదంలో దగ్ధమైనట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాద ఘటనపై ఫైర్‌ సర్వీసెస్‌ డీజీ విక్రమ్‌ సింగ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ఈ సమావేశంలో ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ అధికారులు, రెవెన్యూశాఖ అధికారులు, ఎలక్ట్రిసిటీ విభాగం ప్రతినిధులు, సైబర్‌ వింగ్‌ అధికారులు హాజరయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది, అగ్నిప్రమాదం మొదలైన ప్రాంతం, అగ్ని వ్యాప్తి తీరును అధికారులు ఫైర్‌ డీజీకి వివరించారు. ప్రాథమికంగా అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు చర్చించారు. ఎలక్ట్రికల్‌ షార్ట్‌సర్క్యూట్‌, పరికరాల్లో సాంకేతిక లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో ఉన్న లోపాలు వంటి అంశాలపై లోతైన విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిసిటీశాఖ అధికారులు తమ పరిధిలోని అంశాలపై నివేదిక సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.

ఫొరెన్సిక్‌ ల్యాబ్‌లో ఉన్న కీలక ఆధారాలు, డిజిటల్‌ డేటా, సైబర్‌ సాక్ష్యాల భద్రతపై సైబర్‌ వింగ్‌ అధికారులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. అగ్ని ప్రమాదం వల్ల ఏవైనా కీలక ఆధారాలకు నష్టం వాటిల్లిందా? బ్యాకప్‌ డేటా పరిస్థితి ఏంటి? అన్న అంశాలపై సమగ్రంగా పరిశీలన జరుపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫైర్‌ డీజీ విక్రమ్‌ సింగ్‌ మాట్లాడుతూ… అగ్ని ప్రమాదాల విషయంలో నిర్లక్ష్యం ఏమాత్రం ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ కీలక సంస్థల్లో ఫైర్‌ సేఫ్టీ ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని, అవసరమైతే అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదానికి (Forensic Lab Fire) గల ఖచ్చితమైన కారణాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని, బాధ్యత నిర్ధారణ కూడా తప్పనిసరిగా చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఫైర్‌ ఆడిట్‌, సేఫ్టీ డ్రిల్స్‌, పరికరాల తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశం అనంతరం అధికారులు అగ్ని ప్రమాదంపై సమగ్ర నివేదిక తయారు చేయనున్నట్లు తెలిపారు.

Read Also: సీఎం రేవంత్ ఎప్పటికైనా బీజేపీ మనిషే : కేటీఆర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>