కలం, వెబ్ డెస్క్: వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల (Mangoes)తో మార్కెట్లు కళకళలాడిపోతాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే మామిడి పండ్ల డిమాండ్‌ను అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారు. ఇదే అదునుగా కల్తీ పండ్లను మార్కెట్‌లోకి దించుతున్నారు. ఈ నేపథ్యంలో కల్తీ మామిడి పండ్లతో జాగ్రత్తగా ఉండాలంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Sajjanar) హెచ్చరించారు. ఈ మేరకు సజ్జనార్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. నోరూరించే మామిడి పండ్ల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్రజలు విస్మరించకూడదని తన పోస్టులో పేర్కొన్నారు. కాసుల కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజ సిద్ధంగా పండాల్సిన మామిడిని కాల్షియం కార్బైడ్, ఇతర రసాయాలను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారని తెలిపారు. రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ కనిపిస్తున్న ప్రతి పండును నాణ్యమైనదిగా భావించి కొనుగోలు చేయడమంటే అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమేనన్నారు.
సాధారణంగా సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదని, కానీ రసాయనాలతో మగ్గించిన పండ్లు పైన పసుపు పచ్చగా ఉండి, లోపల మాత్రం పచ్చిగా ఉండి విషతుల్యంగా మారుతాయని సజ్జనార్ తెలిపారు. ఇలాంటి పండ్లను తినడం వల్ల గొంతు మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ వ్యాపారుల పట్ల హైదరాబాద్ పోలీస్ విభాగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతోందని సజ్జనార్ వెల్లడించారు. కల్తీ మామిడి పండ్లపైనా హెచ్-ఫాస్ట్ నిఘా ఉంచుతోందన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పండ్లను చూసి మోసపోకుండా, సహజత్వాన్ని గుర్తించి కొనుగోలు చేయాలని కోరారు.
సహజంగా పండిన పండ్ల కంటే అసహజమైన రంగు, రసాయన వాసన, వింత రుచి కలిగిన మామిడి పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పండ్లపై అసాధారణ మచ్చలున్నా లేదా బేకింగ్ సోడా నీటిలో కడిగినప్పుడు రంగు మారినా అవి ఆరోగ్యానికి హానికరమని గ్రహించాలన్నారు. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ ఫోన్ నంబర్ 8712661212కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

