కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు (Saraswati Anthya Pushkaralu) వైభవంగా జరుగుతున్నాయి. నాల్గవ రోజు త్రివేణి సంగమంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటుగా మహరాష్ట్ర,చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించి సైకత లింగాలను ఏర్పాటు చేసి పరమశివునికి పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో గోదావరి నదీ తీరంతో పాటు ముక్తీశ్వర స్వామి ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బస్టాండ్ నుంచి గోదావరి పుష్కర ఘాట్ల వరకు భక్తులను చేరవేసేందుకు అధికారులు ప్రత్యేకంగా ప్రైవేట్ వాహనాలను ఏర్పాటు చేశారు.
మే 21 నుంచి జూన్ 1 వరకు..
మే 21 నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరం (Kaleshwaram) వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పుష్కర స్నానాలు ఆచరించేందుకు తరలి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. తొలిరోజు సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజు ఉదయం 5.43 గంటలకు పవిత్ర సంగంలో తొలి పుష్కర స్నానం నిర్వహించబడింది. ఈ పుణ్యస్నానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు, మంత్రి శ్రీధర్ బాబు దంపతులు, మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు ఆచరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. భద్రత, పారిశుధ్యం, తాగునీరు, వైద్య సేవలు, రవాణా వంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు.
Read Also: ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎబోలా.. 200 మంది మృతి
Follow Us On: Instagram

