కలం, డెస్క్ : మన దేశంలో అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ల విలువ రూ.42వేల కోట్లకు పైమాటే. అంటే ఎఫ్డీలు, పింఛన్లు లేదా ఇతర మార్గంలో బ్యాంకులో డబ్బులు జమ చేసి వాటిని క్లెయిమ్ చేయకుండా వదిలేసినవి. ఇంట్లో వయసైపోయిన నానమ్మ, తాతయ్యలు చనిపోయినప్పుడు వారి ఖాతాల్లో ఎంత డబ్బు ఉంది అనేది తెలుసుకోకుండా చాలా మంది వదిలేస్తుంటారు. వారి పింఛన్ డబ్బులు లేదా ఇతర ఎఫ్డీలు ఏమైనా ఖాతాల్లో అలాగే ఉన్నాయా అనేది తెలుసుకుంటే ఈజీగా విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఇంటిపెద్ద ఏదైనా ఎఫ్డీ లాంటివి చేసి మధ్యలో చనిపోతే.. వాటిని కూడా బ్యాంకులకు వెళ్లకుండా ఇంటి వద్దే తెలుసుకోవచ్చు. తాతలు, తండ్రుల బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి నగదు ఉన్నా సరే వాటి హక్కులు వారసులకు ఉంటాయి. కాబట్టి మీ తాత లేదా తండ్రి, ఇతరులకు సంబంధించిన వారి ఖాతాల్లో ఎంత నగదు ఉందో ఉద్గమ్ పోర్టల్ (UDGAM) లో తెలుసుకోవచ్చు. ఆ ప్రాసెస్ గురించి చూద్దాం.
ఎలా చెక్ చేయాలి..?
ఈ udgam.rbi.org.in వెబ్ సైట్ ను ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ఎవరి పేరు మీద నగదు నిల్వలు చెక్ చేయాలి అనుకుంటున్నారో వారి పేరు, ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ లాంటి వివరాలను అందులో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు బ్యాంకుల లిస్టు కనిపిస్తుంది. ఒక్కొక్క బ్యాంకును చెక్ చేసుకోవచ్చు. లేదంటే అన్ని బ్యాంకులను ఒకేసారి చెక్ చేయొచ్చు. అతని పేరు మీద ఏ బ్యాంకులో ఎంత డబ్బు ఉందో మీకు కనిపిస్తుంది.
ఇలా క్లెయిమ్ చేయండి..
మీ తాతలు లేదా తండ్రుల పేరు మీదున్న నగదు నిల్వలకు మీరే హక్కుదారుగా ఉంటారు. ఆ సొమ్ము ఏ బ్యాంకులో ఉందో చెక్ చేశాక.. సంబంధిత బ్యాంకు బ్రాంచ్ కు వెళ్లి కేవైసీ డాక్యుమెంట్లు, మీరే వారసులు అని చెప్పే ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. బ్యాంకు అధికారులు అన్ని వివరాలు చెక్ చేసి మీ అకౌంట్ లోకి ఆ డబ్బులను బదిలీ చేస్తారు. మీ వాళ్లు మీ కోసం కూడబెట్టిన డబ్బులను వృథాగా వదిలేయకుండా ఈ విధంగా విత్ డ్రా చేసుకోండి.


