కలం డెస్క్ : హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీ(GHMC)లో విలీనమైన తర్వాత 12 జోన్లుగా, 60 సర్కిళ్ళుగా, 300 డివిజన్లుగా మారింది. జీహెచ్ఎంసీ పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగుస్తుంది. ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ రాజకీయ కసరత్తు మొదలుపెట్టింది. ఒకే కార్పొరేషన్‌గా ఎన్నికలు జరిగితే పొలిటికల్ అడ్వాంటేజ్ ఉండదనే భావనతో మూడు కార్పొరేషన్లుగా విడగొట్టాలనుకుంటున్నది. ఆ తర్వాత ఎన్నికలు జరిపితేనే రాజకీయంగా కలిసొస్తుందన్నది కాంగ్రెస్ ఆలోచన. ఒక్కో కార్పొరేషన్‌లో ఎన్ని డివిజన్లు ఉండాలనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. మూడు భాగాలుగా విడిపోయిన తర్వాతనే ఎన్నికలు జరపాలనే ఆలోచన మాత్రం దాదాపుగా ఖరారైనట్లు పార్టీ వర్గాల సమాచారం. లీగల్ ప్రొసీజర్ పూర్తయిన తర్వాత క్లారిటీ వస్తుంది.
పార్టీ వీక్‌గా ఉన్నందునే మూడు ముక్కలు :
శివారు ప్రాంతాల్లోని పట్టణ మున్సిపల్ బాడీలు విలీనమైన తర్వాత దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్ఎంసీ అవతరించింది. దాదాపు 2000 చ.కి.మీ. విస్తీర్ణం, 1.35 కోట్ల జనాభాతో పాలనాపరమైన సమస్యలూ ఉంటాయని ప్రభుత్వం భావించింది. ప్రజలకు సత్వర, మెరుగైన సేవలు అందేలా ఢిల్లీ నగరంలో ఉన్న తరహాలోనే మూడు కార్పొరేషన్లుగా విడగొట్టాలనే ఆలోచనపై ఇటీవల మంత్రివర్గంలో చర్చించినట్లు తెలిసింది. దాంతో ఒక్కో మున్సిపల్ కార్పొరేషన్‌లో సగటున 100 చొప్పున డివిజన్లు ఉంటే ఎక్కువ సీట్లను గెల్చుకోడానికి అవకాశం ఉంటుందనేది కాంగ్రెస్ ఆలోచన. ప్రస్తుతం పట్టణ ప్రాంతంలో కాంగ్రెస్‌కు తగినంత బలం లేని కారణంగా మూడు ముక్కలు చేయడమే ఉత్తమమనేది దీని వెనక ఉన్న ఉద్దేశం. ఫిబ్రవరి చివరి నాటికి ఇది కొలిక్కి వస్తే ఆ తర్వాత ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.
జూబ్లీహిల్స్ గెలుపు తర్వాత ఉత్సాహం :
ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో జూబ్లీ హిల్స్ స్థానాన్ని కాంగ్రెస్ కైవశం చేసుకున్నది. బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహాన్నిచ్చింది. గతంలో కంటోన్మెంట్‌ను సైతం కాంగ్రెస్ గెల్చుకున్నది. నగరంలో పార్టీ విస్తరణ, బలోపేతం చర్యలు ఒకవైపు తీసుకుంటూనే జీహెచ్ఎంసీ మూడు భాగాలైన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే అన్నింటినీ కైవశం చేసుకోవచ్చన్నది ఆ పార్టీ భావన. జీహెచ్ఎంసీలో (GHMC) బీఆర్ఎస్ పార్టీకి తగినంత కేడర్ ఉందనేది అటు ఆ పార్టీలోనేకాక కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఒక సాధారణ అభిప్రాయమే ఉన్నది. దీని స్థానంలో కాంగ్రెస్ గతంకంటే స్ట్రాంగ్ అయిందనే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నది. బీఆర్ఎస్, బీజేపీ వీక్ అవుతున్నాయన్న వాతావరణాన్ని సృష్టించాలనుకుంటున్నది. జీహెచ్ఎంసీ మూడు భాగాలుగా విడిపోయిన తర్వాత జరిగే ఎన్నికల్లో అది కలిసొస్తుందనేది కాంగ్రెస్ భావన.
మూడు ముక్కలు, ఆ తర్వాత ఎన్నికలు :
దీన్ని పరిగణనలోకి తీసుకునే జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్‌లుగా విడగొట్టి ఆ తర్వాత ఎన్నికలు జరపాలని కాంగ్రెస్ భావిస్తున్నది. అప్పుడు మూడు చోట్లా కాంగ్రెస్ మేయర్‌లే ఉంటారు. అవసరమైతే మజ్లిస్ సహకారం ఎలాగూ ఉంటుందన్నది ఆ పార్టీ వాదన. బీఆర్ఎస్, బీజేపీలకు ఒక్క మేయర్ స్థానం కూడా దక్కకుండా చేయడమే కాంగ్రెస్ లక్ష్యం. లీగల్ ప్రొసీజర్‌ను వీలైనంత తొందరగా పూర్తిచేసి ఆ తర్వాత ఎన్నికలు జరిపించాలనుకుంటున్నది. ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో జీహెచ్ఎంసీ గడువు పూర్తికానున్నందున ఎక్కువ ఆలస్యం చేయకుండా వీలైనంత తొందరగా ఎన్నికలు కంప్లీట్ చేసేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. కాంగ్రెస్ శ్రేణుల, ఎమ్మెల్యేల ఫీడ్ బ్యాక్ సేకరించడం మొదలైంది.
Read Also: అసెంబ్లీలో భారమంతా వారిద్దరిదే
Follow Us On: X(Twitter)


