కలం, వెబ్ డెస్క్ : ఇంట్లో ఏదైనా పని చేస్తునప్పుడో, కూరగాయలు తరుగుతున్నప్పుడో మనకు గాయాలవడం సహజం. గాయమైన వెంటనే మనం యాంటిబయటిక్ లోషన్ కోసం వెతుకుతాం. ఇంకొందరు వెంటనే యాంటీబయటిక్ అని దెబ్బపై పసుపు రాస్తారు. అంతేకాకుండా చాలా మంది యాంటీసెప్టిక్ లోషన్లు కూడా వాడతారు. కానీ, ఆధునిక రసాయనాల కంటే మన వంటింట్లో ఉండే తేనె (Honey) గాయాలను మాన్పడంలో అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాచీన ఈజిప్ట్, రోమ్ కాలం నుంచే తేనెను చర్మ చికిత్సలకు వాడేవారన్న విషయం ఇప్పుడు మళ్లీ ప్రాధాన్యత సంతరించుకుంది.
తేనె (Honey) లో ఉండే ప్రత్యేకమైన రసాయన గుణాలు చిన్నపాటి గాయాలను త్వరగా నయం చేస్తాయి. గాయంపై తేనెను పూసినప్పుడు, అది చర్మంలోని తేమతో కలిసి ‘హైడ్రోజన్ పెరాక్సైడ్’ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బ్యాక్టీరియాను అంతం చేసే ఒక సహజ కవచంలా పనిచేస్తుంది. మార్కెట్లో దొరికే పెరాక్సైడ్ లోషన్లు మంట పుట్టిస్తాయి, కానీ తేనె ఎంతో సున్నితంగా గాయాన్ని శుభ్రపరుస్తుంది. దీనిలోని ఆమ్ల గుణాలు బ్యాక్టీరియా జీవించలేని విధంగా ‘పీహెచ్’ (pH) స్థాయిని తగ్గిస్తాయి.
సాధారణంగా గాయంపై వేసే కట్టు ఎండిపోయి, కొత్తగా పుడుతున్న కణాలను దెబ్బతీస్తుంది. కానీ తేనె తేమను నిలిపి ఉంచే గుణాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల గాయంపై పక్కులు కట్టి దురద రాకుండా, కణాలు త్వరగా కలిసిపోయి గాయం మానిపోతుంది. కేవలం ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవడమే కాకుండా, కొత్త కణజాలం పెరగడానికి అవసరమైన ఇంధనాన్ని కూడా తేనె అందిస్తుంది. గాయం అయినప్పుడు వచ్చే వాపు, ఎరుపు, నొప్పిని తగ్గించే ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ ఏజెంట్‌గా తేనె అద్భుతంగా పనిచేస్తుంది. శస్త్రచికిత్స తర్వాత అయ్యే పెద్ద గాయాలను మాన్పడానికి కూడా తేనెను ‘హైడ్రోజెల్’ రూపంలో వాడే అంశంపై ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
ఇంట్లో గాయాలైనప్పుడు ముందుగా ఆ ప్రాంతాన్ని నీటితో శుభ్రం చేయాలి. ఆపై తక్కువ మోతాదులో తేనెను పూయాలి. బట్టలకు అంటుకోకుండా ఉండాలంటే పైన ఒక చిన్న బ్యాండేజ్ వేసుకోవచ్చు. అయితే, అత్యధిక ఎంజైమ్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే సహజమైన లేదా మెడికల్ గ్రేడ్ తేనెను వాడటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ సిద్ధమైన ఔషధం నేటి రసాయన ప్రపంచంలో ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.
Read Also: కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్.. కానీ ఆ 30 నిమిషాలే సమస్య!
Follow Us On: X(Twitter)

