కలం, వెబ్‌డెస్క్: నేటి డిజిటల్ యుగంలో ల్యాప్ టాప్, స్మార్ట్‌ఫోన్ (Smartphone) మన జీవితంలో ఒక ముఖ్య భాగమైపోయింది. అయితే, గంటల తరబడి ఫోన్ (Smartphone Usage)ను చేతిలో పట్టుకుని, స్క్రీన్‌పై వేళ్లతో నిరంతరం టైప్ చేయడం లేదా స్క్రోల్ చేయడం వంటివి చేస్తుంటాం. దీనివల్ల మన చేతుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీనినే టెక్స్ట్క్‌క్లా అని అని పిలుస్తారని చెబుతున్నారు.
అయితే గంటల తరపడి ఇలా చేయడం వల్ల చేతి కండరాలు, నరాలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయట. దీని ఫలితంగా చేతి వేళ్లు వంకరగా మారిపోవడం, మణికట్టులో నొప్పి, చేతులు తిమ్మిర్లు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఫోన్‌ను పట్టుకునేటప్పుడు చేయి ఒక “పంజా” (Claw) లాగా ముడుచుకుపోవడం వల్ల దీనికి ‘టెక్స్ట్ క్లా’ అనే పేరు వచ్చిందని చెబుతున్నారు నిపుణులు.
టెక్స్ట్క్‌క్లా వలన కలిగే ప్రధాన సమస్యలు
బొటనవేలిపై ప్రభావం
మెసేజ్‌లు పంపేటప్పుడు, స్క్రోలింగ్ చేసేటప్పుడు బొటనవేలు చేసే విస్తృత కదలికలు కండర బంధాలను చిరాకు పెట్టి నొప్పిని కలిగిస్తాయని చెబుతున్నారు.
స్మార్ట్‌ఫోన్ పింకీ- పెద్ద ఫోన్లను పట్టుకోవడం వల్ల చిటికెన వేలుపై అదనపు ఒత్తిడి పడుతుందట.
తీవ్రమైన అనారోగ్య సమస్యలు
స్మార్ట్ ఫోన్‌ను అధికంగా వినియోగించడం వల్ల ‘టెండనైటిస్’, ‘ట్రిగ్గర్ ఫింగర్’, ‘కార్పల్ టన్నెల్ సిండ్రోమ్’, ముంజేతి కండరాల ఒత్తిడి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీని వలన వేళ్లలో తిమ్మిర్లు, మణికట్టులో అసౌకర్యం, వస్తువులను పట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందట. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు.
నివారణ చర్యలు
విరామం పాటించడం
అధికంగా ఫోన్, ల్యాప్ టాప్ ఉపయోగించే వారు ప్రతి 30 నుంచి 45 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకుని చేతులు, మణికట్టులను స్ట్రెచ్ చేస్తూ ఉండాలని చెబుతున్నారు.
సరైన అలవాట్లు
టైపింగ్ చేయడం కోసం రెండు చేతులను ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు. వీలైతే వాయిస్ టైపింగ్‌ను ఎంచుకోవడం ఇంకా మంచిదని చెబుతున్నారు. ఫోన్‌ను గట్టిగా పట్టుకోకుండా స్టాండ్ లేదా హోల్డర్ ఉపయోగించడం వలన కాస్త ఉపశమనం ఉంటుందట.
కూర్చునే విధానం
ఫోన్ స్క్రీన్‌ను కంటి స్థాయి వద్ద ఉంచుకోవడం, సరైన కూర్చునే భంగిమను పాటించడం వల్ల చేతులపై ఒత్తిడి తగ్గి ఈ సమస్య నుంచి బయటపడవచ్చట. ఎర్గోనామిక్ కీబోర్డులు, మౌస్ వంటి పరికరాలు చేతులకు ఎంతో మేలు చేస్తాయని సూచిస్తున్నారు నిపుణులు.
చేతి వ్యాయామాలు
చేతులకు సంబంధించిన వ్యాయామాలు చేయడం. ఉదాహరణకు మణికట్టు స్ట్రెచ్‌లు, వేళ్ల వ్యాయామాలు, ముంజేతి కండరాల స్ట్రెచ్‌లను క్రమం తప్పకుండా చేయడం ద్వారా చేతుల బలం, చురుకుదనాన్ని పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.
ప్రస్తుత కాలంలో డిజిటల్ పరికరాలు మన జీవితాన్ని చాలా సులభతరం చేస్తున్నాయి. కానీ వాటి అధిక వినియోగం చేతుల ఆరోగ్యానికి సవాలుగా మారుతోంది. లక్షణాలు కొన్ని వారాల పాటు కొనసాగితే లేదా బలహీనత పెరిగితే, తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి ఫిజియోథెరపీ వంటి చికిత్సలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. సరైన అవగాహన, చిన్న చిన్న మార్పులు చేయడం ద్వాకా టెక్స్ట్ క్లా వంటి సమస్యలను నివారించవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

