Mobile Popup Ad
Mobile Popup Ad

బడి లేదు, రోడ్డు లేదు.. మాంగ్లీ గూడెం వాసుల తీరని గోస!

కలం, ఆదిలాబాద్ బ్యూరో : ఆదివాసీ గూడేలకు వెళ్లే దారి దడ పుట్టిస్తోంది. గిరిజన బిడ్డలకు ప్రాణగండంగా మారింది. ఆస్పత్రికి వెళ్లాలంటే అంబులెన్స్ రాదు. కాలిబాటన వెళ్లాలంటే అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. వర్షాకాలంలో వాగులు ఉప్పొంగి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. దీంతో గూడేలు చీకట్లో ఉండిపోతుండగా ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని మాంగ్లీ మారుమూల గూడేల (Mangli  Hamlet) పరిస్థితి. జిల్లా కేంద్రానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోని గూడేంలో సుమారు 200 మంది నివసిస్తున్నారు. వీరంతా కొండ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నిత్యావసరాల కోసం మూడున్నర కిలోమీటర్ల దూరంలోని వాన్వట్ గ్రామానికి వెళ్లాల్సి వస్తున్నది. అక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. గూడెం నుంచి వాన్వట్ గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్డు లేదు. కాలిబాటే దిక్కైంది. అది కూడా పెద్ద బండరాళ్లతో నిండిపోవడంతో నడవడమే కష్టంగా మారింది. అయినప్పటికీ తమ అవసరాల కోసం ప్రతిరోజూ అదే ప్రమాదకర మార్గంలో ప్రయాణించక తప్పడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాళ్లతో నిండిన ఈ దారి నరకప్రాయంగా మారిందని చెబుతున్నారు.

బడికి వెళ్లే పరిస్థితి లేక చదువుకు దూరం..

గూడెంలో ప్రభుత్వ పాఠశాల కూడా లేకపోవడంతో విద్యార్థులు చదువు కోసం వాన్వట్ గ్రామానికి వెళ్లాల్సి వస్తున్నది. రాకపోకల ఇబ్బందుల కారణంగా పలువురు విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యం బారిన పడితే పరిస్థితి మరింత దయనీయంగా మారుతున్నది. రోడ్డు లేకపోవడంతో అంబులెన్స్ చేరుకోలేకపోతున్నది. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు, రోగులను ఎడ్ల బండిపై తీసుకెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని పేర్కొంటున్నారు. వృద్ధులు పింఛన్ తీసుకోవడానికి కూడా కాలిబాటన వెళ్లాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతాయి. అప్పుడు గూడెం నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి సురక్షితంగా ఇంటికి చేరుతారో లేదోననే ఆందోళన నెలకొంటుందని గిరిజనులు చెబుతున్నారు. వరద నీరు తగ్గిన తర్వాతే తిరిగి గ్రామానికి చేరుకునే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. వర్షాకాలంలో బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గూడెం వాసులు వాపోతున్నారు. రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ గూడెనికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>