అధికారులు తిరిగే బాటలోనే ఆమె బ్రతుకు.. ట్రాఫిక్ బూతే ఇల్లు..!

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని రెండు వంతెనల మధ్య ఉన్న ఒక పాత ట్రాఫిక్ బూత్ ఇప్పుడు ఒక వృద్ధురాలికి ‘ఇల్లు’గా మారింది. ప్రజాప్రతినిధుల కాన్వాయ్‌లు సైరన్లతో దూసుకుపోయే రహదారి వెంట … కలెక్టర్ నుండి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ భద్రాద్రి రామయ్య దర్శనానికి వెళ్లే మార్గం లో ఉండే నిస్సహాయ స్థితిలో ఉన్న సదరు వృద్ధురాలి ప్రాణం ఎవరికీ పట్టడం లేదు. ఆ బూత్ బయటే ఒక చిన్న కట్టెల పొయ్యి.. అక్కడే వంట.. అక్కడే నిద్ర. వానొచ్చినా, ఎండ కాసినా ఆ ఆరు అడుగుల గదియే ఆమెకు సర్వస్వం.

ప్లాస్టిక్ వస్తువులు, చిత్తు కాగితాలు ఏరుకుంటూ ​గత రెండేళ్లుగా ఆ చిన్నపాటి ఇనుప డబ్బాలోనే (ట్రాఫిక్ బూత్) ఆమె కాలం వెళ్లదీస్తోందనీ.. పగలంతా రోడ్ల వెంబడి ప్లాస్టిక్ వస్తువులు ఏరుకుంటూ, వాటిని అమ్ముకుని వచ్చే కొద్దిపాటి ఆదాయంతో వృద్ధురాలు పొట్ట నింపుకుంటోందనీ గ్రామస్తులు చెప్తున్నారు. మానసిక పరిస్థితి బాగోలేని ఆమెకు ఎవరూ లేరని అంటున్నారు. జ్ఞాపకాలు చెదిరిపోయి, తనకంటూ ఒక నీడ లేక ఆ ట్రాఫిక్ బూత్‌ను ఆశ్రయించిన ఆమె దుస్థితిని చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు.

​నిత్యం భద్రాచలం వచ్చే అధికారుల కంటికి ఈ దీనస్థితి ఎందుకు కనపడటం లేదు? ​ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి? అనాథల కోసం, వృద్ధుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశ్రమాల్లో ఆమెకు చోటు కల్పించలేరా? యంత్రాంగం ఏం చేస్తోంది? సామాజిక బాధ్యతగా ఆమెను గుర్తించి, వైద్య సాయం అందించి ఏదైనా ఓల్డేజ్ హోమ్‌కు తరలించాల్సిన బాధ్యత అధికారులపై లేదా? అనే ప్రశ్నలు స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి.

​జీవిత చరమాంకంలో ఉన్న ఆ వృద్ధురాలికి కావాల్సింది విలాసాలు కాదు.. తల దాచుకోవడానికి ఒక సురక్షితమైన నీడ, గుక్కెడు నీళ్లు, పూటకో ముద్ద. జిల్లా యంత్రాంగం లేదా స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికైనా స్పందించి, ఆమెను ఒక ఆశ్రమానికి చేర్చాలని స్థానికులు కోరుతున్నారు. “ప్రతిరోజూ వందల వాహనాలు ఈ మార్గంలో వెళ్తాయి. అధికారులు, నాయకులు అందరూ చూస్తూనే ఉంటారు. కానీ, ఈ బామ్మ కష్టం ఎవరికీ కనబడటం లేదంటేనే బాధగా ఉంది” అని బూర్గంపాడుకు చెందిన నాగమల్లేష్ అనే వ్యక్తి వాపోయారు. ఆమె దీనవస్థపై ​భద్రాద్రి జిల్లా యంత్రాంగం స్పందిస్తుందా? ఆ వృద్ధురాలికి ఆవాసం దొరుకుతుందా? వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>