Mobile Popup Ad
Mobile Popup Ad

కొత్తగూడెంలో సీపీఐ భారీ ప్రదర్శన.. మోదీపై కూనంనేని ఆగ్రహం

కలం, ఖమ్మం బ్యూరో: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుండం వలనే సామాన్య ప్రజలపై నిత్యావసర భారాలు విపరీతంగా పెరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం (Kothagudem) ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. బుధవారం పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాళీ సిలిండర్లు, ప్లకార్డులతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడి వంటిల్లు మండుతున్నా.. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. నిత్యావసరాల ధరల నివారణకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టకుండా, కార్పొరేట్ శక్తుల దోపిడీకి ఎర్రటి తివాచీ పరుస్తున్నారని మండిపడ్డారు.

‘ఇంధన కొరతపై ముందస్తు ప్రణాళికే లేదు..’

ప్రజా పంపిణీ వ్యవస్థను అటకెక్కించి పేదల నోటికాడ కూడును లాగేస్తున్నారని, వెంటనే పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ప్రజల ప్రాథమిక అవసరాలను హక్కుగా గుర్తించి నెరవేర్చాల్సింది పోయి, వాటిని వ్యాపార వస్తువులుగా మార్చడం సిగ్గుచేటన్నారు. దేశంలో ఇంధన కొరతపై ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళికే లేదని, ఇప్పటికైనా నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సామాన్యుడి గొంతుకై నిలబడతామని, ఈ పోరాటాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, పార్టీ నేతలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>