epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

హైకోర్టు విచారణపైనే సర్కార్ దృష్టి.. రెగ్యులర్ డీజీపీ పోస్ట్ ఎవరిని వరిస్తుందో?

కలం డెస్క్ : Telangana DGP Appointment Case | ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన బాధ్యతలు నిర్వర్తిస్తున్న శివధర్‌రెడ్డే ఫుల్ టైమ్ డీజీపీగా కంటిన్యూ అవుతారా?.. ఆరు నెలల సర్వీసు ఉండాలన్న నిబంధన చిక్కులు తెస్తుందా?.. ఆయన స్థానంలో కొత్తవారికి అవకాశం వస్తుందా?.. యూపీఎస్సీ నుంచి కొర్రీలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరున్న ప్రత్యామ్నాయమేంటి?.. ప్రభుత్వం పంపిన ప్యానెల్ రిటన్ రావడంతో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?.. ఇలాంటి అనేక రకాలుగా ఆసక్తికరమైన చర్చలు పోలీసు వర్గాల్లో జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన మూడుసార్లూ యూపీఎస్సీ నుంచి జాబితా రిటన్ రావడం, నిబంధనల గురించి కొర్రీలు వేయడం, ఫుల్ టైమ్ డీజీపీ నియామకంపై క్లారిటీ రాకపోవడం.. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టులో శుక్రవారం జరిగే విచారణలో ప్రభుత్వం తరఫు న్యాయవాది ఏ వాదనలు వినిపిస్తారన్నది కీలకంగా మారింది.

యూపీఎస్సీ నుంచి ప్యానెల్ లిస్టు రిటన్ :

తెలంగాణ డీజీపీగా జితేందర్ రిటైర్ అయిన తర్వాత పూర్తిస్థాయి డీజీపీని నియమించేందుకు మూడు నెలల ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతేడాది సెప్టెంబరులో జితేందర్ పదవీ విరమణ చేస్తుండడంతో జూన్‌లోనే అర్హుల జాబితాను ప్రభుత్వం యూపీఎస్సీకి పంపింది. అందులో కొన్ని వివరాల్లో తేడాలు ఉన్నాయని కొర్రీలు వేసి తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఆ తర్వాత సెప్టెంబరులో మరోసారి పంపింది. అందులోనూ సమగ్రత లేదని రిటన్ చేసింది. ఈ లోపు శివధర్‌రెడ్డి తాత్కాలిక డీజీపీగా సెప్టెంబరులో నియమితులయ్యారు. ఈ నియామకాన్ని సవాలు చేస్తూ ధనగోపాల్ హైకోర్టులో పిటిషన్ (Telangana DGP Appointment Case) దాఖలు చేశారు. దాన్ని విచారించిన బెంచ్.. ప్రభుత్వం నిబంధనలు ఫాలో కాలేదని, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు స్ఫూర్తిని పాటించలేదని స్పష్టం చేసి ఫ్రెష్ జాబితాను యూపీఎస్సీకి పంపాలని సూచించింది.

థర్డ్ లిస్టుపైనా యూపీఎస్సీ అసంతృప్తి :

హైకోర్టు ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం మూడోసారి ప్యానెల్ లిస్టును డిసెంబరు చివర్లో యూపీఎస్సీకి పంపింది. పాజిటివ్ స్పందన వస్తుందనుకున్న ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న యూపీఎస్సీ చివరకు సుప్రీంకోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలంటూ రాష్ట్రానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందన్న అభిప్రాయాన్ని అటార్నీ జనరల్‌ వ్యక్తం చేసినట్లు తెలిసింది. తాజా లిస్టులో ఆరుగురు సీనియర్ ఐపీఎస్‌ల పేర్లను ప్రభుత్వం పేర్కొన్నది. ప్రస్తుతం హోం సెక్రటరీగా పనిచేస్తున్న 1991 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్, 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్‌ ప్రభాకర్‌ ఆప్టే, శివధర్‌రెడ్డి, అభిలాష భిష్ట్, సౌమ్యామిశ్రా, శిఖాగోయల్‌ పేర్లు ఉన్నాయి. ముగ్గురిని షార్ట్ లిస్టు చేసి పంపుతుందని భావించిన ప్రభుత్వానికి ఊహించని జవాబు వచ్చింది.

జాబితాలోని పేర్లతోనే చిక్కులన్నీ :

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూన్‌లో పంపిన పేర్లలో తెలంగాణ కేడర్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే పేరు లేదు. ఆయన పేరు ఎందుకు పెట్టలేదని యూపీఎస్సీ ఆ జాబితాను రిటన్ చేసింది. ఆయన తెలంగాణ కేడర్ ఆఫీసర్ అయినప్పటికీ దీర్ఘకాలంగా కేంద్ర సర్వీసుల్లో ఉన్నందున పెట్టలేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయినా సీనియర్ కేడర్ అయినందున పేరు పెట్టాలని సూచించింది. ఆ తర్వాత సెప్టెంబరులో రెండోసారి పంపిన జాబితాలో అభిలాష భిష్ట్ పేరును ప్రభుత్వం పేర్కొన్నది. ఆమె ఏపీ కేడర్ అధికారి అని, ఆ రాష్ట్ర జాబితాలో ఆమె పేరు ఉన్నదని, తెలంగాణలో పనిచేస్తుండడంతో ఆమె పేరును ఎలా పెడతారని ప్రశ్నించి రిటన్ చేసింది. రెండు జాబితాల మధ్య దాదాపు మూడు నెలల జాప్యం చోటుచేసుకుంది. డిసెంబర్ 31న పంపిన థర్డ్ లిస్టులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం డీజీపీ పదవీ విరమణ చేయడానికి కనీసం ఆరు నెలల సర్వీస్ ఉండాలన్న షరతును సీరియస్‌గా తీసుకోలేదని యూపీఎస్సీ తప్పుపట్టింది. ఇది సుప్రీం గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఉన్నట్లు అటార్నీ జనరల్ సైతం తేల్చడంతో చిక్కులు తలెత్తాయి.

హైకోర్టు ఆర్డర్‌పైనే ఆశలన్నీ :

హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై బెంచ్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణా తరహాలోనే పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్‌, కొన్ని ఈశాన్య రాష్ట్రాల డీజీపీల ప్రతిపాదనలను సైతం యూపీఎస్సీ వేర్వేరు కారణాలతో తిప్పి పంపించినట్లు సచివాలయ వర్గాలు ఉదహరించాయి. ఇలాంటి చిన్న తేడాలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు మాత్రం కొర్రీలు లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంశాన్ని ఆ వర్గాలు గుర్తుచేశాయి. అత్యున్నత సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుగానీ, యూపీఎస్సీ మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోకుండా ఈ మూడు రాష్ట్రాలకు రెగ్యులర్ డీజీపీల నియామకంలో మినహాయింపులు ఇచ్చి క్లియరెన్స్ ఇచ్చిందని పేర్కొన్నాయి. హైకోర్టులో శుక్రవారం జరగనున్న విచారణలో సరిగ్గా ఇదే అంశాలను ఎత్తి చూపాలని ప్రభుత్వం భావిస్తున్నది. వాదనల తర్వాత హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఆసక్తికరం.

Read Also: సంక్రాంతి తర్వాత బడ్జెట్ సన్నాహాలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>