కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం జీవోలను (Hidden GO) పబ్లిక్ డొమైన్‌లో పెట్టడం లేదని ఆరోపణలు వచ్చాయి. ఏకంగా కోర్టు జోక్యం చేసుకొని దాచి పెట్టిన జీవోలను (Hidden GO) వెంటనే బహిరంగ పరచాలని ఆదేశించింది. దీంతో బీఆర్ఎస్ నుంచి విమర్శలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెబుతూ చీకటి పాలన చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కౌంటర్లు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాచి పెట్టిన జీవోల సంగతేంటని వారు ప్రశ్నిస్తున్నారు. “పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదట” అన్న సామెత బీఆర్ఎస్ నేతలను చూస్తే గుర్తుకు వస్తోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. గత పాలన పాపాలపై ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఆరోపణలు–ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.
జూన్ 2, 2014 నుంచి ఆగస్టు 18, 2019 వరకు ఏకంగా 43,462 ప్రభుత్వ జీవోలు దాచిపెట్టారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 2014–19 మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వం మొత్తం 1,04,171 జీవోలు జారీ చేయగా, వాటిలో కేవలం 60,709 జీవోలను (Hidden GO) మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంచి, మిగిలినవన్నీ గుట్టుగా దాచినట్లు కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై అప్పట్లోనే హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి “మొట్టికాయలు వేసిందన్న విషయాన్ని మర్చిపోయారా?” అంటూ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌ను నిలదీస్తున్నారు. ప్రజలకు తెలియాల్సిన నిర్ణయాలను దాచిపెట్టడం పారదర్శక పాలనకు పూర్తి విరుద్ధమని విమర్శిస్తున్నారు. అంతేకాదు, బీఆర్ఎస్ పాలనలోనూ అనేక కీలక జీవోలు ప్రజలకు తెలియకుండా ఉంచారని, దాదాపు 43 వేలకుపైగా జీవోలు దాచినట్టు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. “మరి ఆ జీవోల పరిస్థితి ఏమైంది? ప్రజలకు వాటి వివరాలు ఎప్పుడు చెబుతారు?” అని ప్రశ్నిస్తోంది.
ప్రస్తుత ప్రభుత్వం జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచాలనే అంశంపై జరుగుతున్న చర్చకు ఇది నేపథ్యంగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ పారదర్శకత పేరుతో బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ కూడా ఎదురుదాడికి సిద్ధమవుతోంది. జీవోలు దాచిపెట్టడం అన్నది ఒక్క పార్టీ సమస్యా? లేక వరుస ప్రభుత్వాల అలవాటా? అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు… ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది.


