కలం, వెబ్‌డెస్క్: మొబైల్ లో ఫ్లైట్ మోడ్ (Flight Mode లేదా Airplane Mode) అనేది స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే ఒక ముఖ్యమైన ఫీచర్. అయితే దీనిని ఆన్ చేసినపుడు ఫోన్ నుంచి వెళ్లే, వచ్చే అన్ని రకాల సిగ్నల్స్ ఆఫ్ అవుతాయని మనందరికి తెలుసు. విమానంలోని కమ్యూనికేషన్ సిగ్నల్స్‌కు మొబైల్ సిగ్నల్స్ అంతరాయం కలిగించకుండా ఈ ఫీచర్ ను వాడుతారు. కేవలం విమాన ప్రయాణాల కోసమే కాకుండా మన రోజూవారీ మొబైల్ ఇబ్బందులను దూరం చేయడంలో కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని మీకు తెలుసా? అవును ఈ ఫ్లైట్ మోడ్ ఫీచర్ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు టెక్ నిపుణులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లైట్ మోడ్ – ఒక అద్భుతమైన ఫాస్ట్ ఛార్జింగ్ ట్రిక్
కొన్నిసార్లు మనం పనిలో పడి బ్యాటరీ డెడ్ అయ్యే వరకు చూసుకోము. కానీ అటువంటి టైమ్‌లోనే అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వచ్చిందనుకోండి. అలాంటప్పుడు ఫోన్‌ను సాధారణ పద్ధతిలో ఛార్జింగ్ పెడితే చాలా సమయం పడుతుంది. ఇలాంటి మనకు ఫ్లైట్ మోడ్ చాలా సహాయపడుతుందని చెబుతున్నారు టెక్ నిపుణులు. ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టి ఛార్జింగ్ కనెక్ట్ చేయడం ద్వారా లోపల జరిగే బ్యాక్‌గ్రౌండ్ నెట్‌వర్క్ సెర్చింగ్‌లు పూర్తిగా నిలిచిపోతాయట. దీనివల్ల మొబైల్ సాధారణం కంటే దాదాపు 20 నుంచి 25 శాతం వేగంగా ఛార్జ్ అవుతుందట. సో తక్కువ సమయంలోనే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ సాధించడానికి ఇది ఒక అద్భుతమైన చిట్కా.
ట్రావెలింగ్‌లో బ్యాటరీ ఆదా చేసేందుకు
మనం ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా సిగ్నల్స్ సరిగ్గా లేని మారుమూల ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది. దీనికి కారణం నెట్‌వర్క్ తక్కువగా ఉన్నప్పుడు, సిగ్నల్‌ను వెతికేందుకు మొబైల్ తీవ్రంగా శ్రమిస్తుంది. అందువల్ల బ్యాటరీ వేగంగా నశిస్తుంది. ఈ సమయంలో కాసేపు ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తే బ్యాటరీ చాలా వరకు ఆదా అవుతుందని చెబుతున్నారు నిపుణులు.
ఫోన్ వేడెక్కే సమస్యకు శాశ్వత పరిష్కారం
కొన్నిసార్లు మొబైల్ లో నెట్‌వర్క్ సరిగ్గా ఉండదు. అలాంటప్పుడు ఇంటర్నెట్ సిగ్నల్స్ కోసం ఫోన్ నిరంతరం వెతుకుతుంది. ఈ సమయంలో మొబైల్ విపరీతంగా వేడెక్కడం మీరు గమనించే ఉంటారు. దీనివల్ల అంతర్గత విడిభాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందట. ఇలా ఫోన్ వేడేక్కినప్పుడు కేవలం 5 నిమిషాల పాటు ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఉంచితే, ఫోన్ నెట్‌వర్క్ వెతకడం ఆపేసి నెమ్మదిగా చల్లబడుతుందట. ఆ తర్వాత తిరిగి మోడ్‌ను ఆఫ్ చేస్తే, సిగ్నల్ కూడా మునుపటి కంటే చాలా వేగంగా, బలంగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు.
పిల్లల చేతికి ఫోన్ ఇచ్చేటప్పుడు
మనం మన పనుల్లో బిజీగా ఉండి ఇంట్లో చిన్న పిల్లలకు ఫోన్ ఇస్తుంటాం. అయితే, పిల్లలు తెలియక స్క్రీన్‌పై ఏది పడితే అది నొక్కుతారు. దీనివల్ల ముఖ్యమైన ఫోన్ సెట్టింగ్స్ మారిపోవడం, లేదా ఆఫీస్ గ్రూపులలో ఎవరికో ఒకరికి అనాలోచితంగా కాల్స్ వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఇలా జరగకుండా ఉండేందుకు పిల్లలకు ఫోన్ ఇచ్చే ముందే ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇది ఇంటర్నెట్ డేటాను నిలిపివేస్తుంది కాబట్టి వారు అనవసరమైన వెబ్‌సైట్లలోకి వెళ్లకుండా, ఎవరికీ కాల్స్ చేయకుండా సురక్షితంగా ఉంటారు.
కాల్స్ తో డిస్టర్బెన్స్ లేకుండా..
కొన్నిసార్లు మనం ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు అనవసర కాల్స్ వచ్చి మనను డిస్టర్బ్ చేస్తుంటాయి. ఇలాంటప్పుడు మనకు పనిపై ఉన్న ఏకాగ్రత దెబ్బతింటుంది. అటువంటప్పుడు ఫ్లైట్ మోడ్‌ను ఆన్ చేసుకుంటే, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా మన పనిపై పూర్తి దృష్టి పెట్టవచ్చు.
ఫ్లైట్ మోడ్ ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా. ఇకనుంచి మీరు కూడా ఈ ఫీచర్ నుంచి ఉపయోగించి ప్రయోజనాలను పొందండి.

