కలం, కరీంనగర్ : భారత తొలి ఉప ప్రధాని ‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 151వ జయంతి సందర్భంగా కరీంనగర్‌లోని (Karimnagar) చైతన్యపురి కాలనీలో గల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, బారీ జితేందర్ మరియు ఇతర నాయకులు పాల్గొని సర్దార్ పటేల్ సేవలను స్మరించుకుంటూ పూలుచల్లి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..560కు పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి అఖండ భారతావనిని నిర్మించిన మహానీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రతల కోసం ఆయన చూపిన మార్గం అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని మరియు తొలి హోం మంత్రిగా సేవలు అందించారని తెలిపారు. స్వాతంత్య్రానంతరం దేశంలో ఉన్న 560కి పైగా స్వదేశీ సంస్థానాలను తన చతురత, దృఢత్వంతో భారత సమాఖ్యలో విలీనం చేసి ‘అఖండ భారత్’ కల నెరవేర్చారన్నారు.
ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడంలో ఆయన వహించిన పాత్ర చారిత్రాత్మకమైనదని అన్నారు. రైతులకు మద్దతుగా 1928లో చేపట్టిన బర్డోలీ సత్యాగ్రహాన్ని విజయవంతంగా నడిపించినందుకే ఆయనకు “సర్దార్” (నాయకుడు) అనే బిరుదు లభించిందని తెలిపారు. దేశ ఐక్యత కోసం ఆయన చేసిన అపారమైన సేవలకు గుర్తుగా ఆయన జన్మదినమైన అక్టోబర్ 31ని కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం “జాతీయ ఐక్యతా దినోత్సవం”గా నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

