Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రభుత్వ బడి నుంచే సీఎం స్థాయికి.. ఆరుట్ల సభలో రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ భవిష్యత్తు అద్దాల మేడల్లోనో, రంగుల గోడల్లోనో లేదని, అది కేవలం తరగతి గదుల్లోనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఆరుట్ల గ్రామంలో ప్రారంభించుకున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ధ్వంసమైన విద్యావ్యవస్థను సంస్కరించి, వికాసం వైపు నడిపించేందుకే ఈ సరికొత్త విద్యా విధానాన్ని తీసుకువచ్చామని వివరించారు.

ఆరుట్ల బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తన విద్యార్థి జీవితాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని, ఆ పునాదితోనే ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి చేరానని తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వంటి ఎందరో మహానుభావులు ప్రభుత్వ బడుల్లో చదివి దేశాన్ని నడిపించారని గుర్తుచేశారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని, ఇక్కడి విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, గొప్ప రాజకీయ నాయకులుగా ఎదిగి తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు.

ప్రతీ నియోజకవర్గానికి ఒక పబ్లిక్ స్కూల్

ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో ఇప్పటికే 1814 మంది విద్యార్థులు చేరడం విశేషమని, ఒక ప్రభుత్వ పాఠశాలకు ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టే పరిస్థితి రావడం నిజంగా హర్షణీయమని సీఎం పేర్కొన్నారు. ఈ విజయం సాధించిన ఉపాధ్యాయులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని వెల్లడించారు. విద్యా కమిషన్ నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో విద్యావ్యవస్థలో మరిన్ని కీలక మార్పులు తీసుకువస్తామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంతో పాటు విద్యా కిట్లను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.

విద్యా, క్రీడా రంగాల్లో విప్లవాత్మక మార్పులు..

రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. డిసెంబరు 9 వ తేదీన స్కిల్స్ యూనివర్సిటీ భవనాన్ని ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారుచేసేందుకు ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు.

విమర్శకులకు రేవంత్ కౌంటర్

ఇటీవల ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని తీసుకువచ్చి విద్యార్థులతో ఆడించడంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. క్రీడలను ప్రోత్సహించాలనే సత్సంకల్పంతో తాము అడుగులు వేస్తుంటే, కడుపులో కుళ్లు పెట్టుకుని రాజకీయం చేస్తున్న వారికి భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా మిగలదని హెచ్చరించారు. విమర్శలు చేసే వాళ్లకు ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ సాధించిన విజయాలను చూపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు అండగా నిలిస్తే అద్భుతాలు సృష్టిస్తామని, తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>