కలం, నిజామాబాద్ బ్యూరో: ఎల్ నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు నీటి పొదుపును పాటించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) సూచించారు. ప్రజలకు ఉపయోగపడే మాధవనగర్, అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయించాలని, రానున్న నాలుగైదు నెలల్లో వీటిని అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో శనివారం ఎంపీ అర్వింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ ఉమారాణి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సమావేశంలో చర్చించారు. అంతకుముందు గత సమావేశంలో చేసిన తీర్మానాలపై చేపట్టిన చర్యల గురించి అధికారులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న నీటి వనరులను ఎంతో జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై ప్రజల్లో, రైతులలో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. కాగా, మాధవనగర్, అర్సపల్లి ఆర్ఓబీల నిర్మాణాల్లో తీవ్ర తాత్సారం జరుగుతోందని ఎంపీ సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మైల్ స్టోన్ ప్రకారం నిర్విరామంగా పనులు జరిపిస్తూ నాలుగైదు నెలలలో పూర్తి చేయించాలని, మరోమారు గడువు పొడిగింపు ఉండకూడదని అధికారులకు సూచించారు.
నిజామాబాద్ నగరంలో భూగర్భ డ్రైనేజీ పనులను కూడా వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని ఎంపీ అధికారులకు డెడ్లైన్ విధించారు. అమృత్ 2.0 పథకం కింద చేపడుతున్న తాగునీటి సరఫరా మెరుగుదల పనులను, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, డీఆర్ఓ గీత, డీఆర్డీఓ సాయన్న, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, వివిధ శాఖల అధికారులు, దిశా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

