కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు (Heatwave Andhra Pradesh) మండిపోతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. ఉక్కబోత, వేడిగాలులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా హెచ్చరించింది. ఆదివారం రోజున ( మార్చి 29) 35 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. 87 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని వెల్లడించింది.
పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం.. విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గుర్ల, మెంటాడ, మెరకముడియం, రాజాం, రామభద్రాపురం, రేగిడిఆముదాలవలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాల్లో.. అలాగే ఎన్టీఆర్ జిల్లాలోని జీ కొండూరు. ఇబ్రహీంపట్నం, కంచికచర్ల.. పోలవరం జిల్లాలోని చింతూరు,కూనవరం మండలాల్లో.. శ్రీకాకుళం జిల్లా బూర్జ, హిర మండలాలు.. అల్లూరి జిల్లా అనంతగిరి మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
కాగా, శనివారం రోజు రాష్ట్రవ్యాప్తంగా 48 చోట్ల.. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అత్యధికంగా మార్కాపురం జిల్లా బొట్లగూడూరులో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరించింది. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ వంటివి ధరించాలని సూచించింది. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలని.. వీలైతే వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు బయటకు రాకపోవడమే మంచిదని చెప్పింది.

