కలం, వెబ్ డెస్క్ : దేశంలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం ఇ-డ్రైవ్’ (PM E-DRIVE) పథకం కింద అందుతున్న రాయితీలను పొడిగిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. మునుపటి నిబంధనల ప్రకారం ఎలక్ట్రిక్ టూవీలర్లకు రాయితీ (Electric Vehicle Subsidy) పొందే గడువు మార్చి 31, 2026 వరకు మాత్రమే ఉండగా.. తాజాగా దీనిని జూలై 31, 2026 వరకు పొడిగించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు ప్రభుత్వ రాయితీ లభిస్తుంది. అయితే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల (ఈ-రిక్షాలు, ఈ-కార్టులు) విషయానికి వస్తే, వీటికి మునుపటి గడువు తేదీ అయిన మార్చి 31, 2026 వరకు రాయితీలు అందుబాటులో ఉంటాయి.
పీఎం ఇ-డ్రైవ్ ప్రత్యేకత ఏంటి?
పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కేవలం టూవీలర్లు, త్రీవీలర్లు మాత్రమే కాకుండా ఇ-అంబులెన్సులు, ఇ-ట్రక్కులకు కూడా ప్రభుత్వం భారీగా రాయితీలు కల్పిస్తోంది. అయితే ఈ పథకం కింద ఇచ్చే రాయితీ (subsidy) వాహనం రకం, బ్యాటరీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. వాహనం బ్యాటరీ సామర్థ్యం (kWh) ఆధారంగా ఇచ్చే రాయితీని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. సాధారణంగా ప్రభుత్వం నిర్ణయించిన నిర్దిష్ట మొత్తం లేదా వాహనం ధరలో గరిష్టంగా 15 శాతం.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే దానినే రాయితీగా ఇస్తారు.

