కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాహుల్ మళ్ళీ హైదరాబాద్‌కు వస్తే ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్‌లో అడ్డం పెట్టి మా ఆటో కార్మికులు నిలదీస్తారు జాగ్రత్త..! అని హెచ్చరించారు. సోమవారం.. ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకోవడం కోసం హరీష్ రావు ఆటోలో ప్రయాణించారు. తన నివాసం నుండి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు, అక్కడినుండి తెలంగాణ భవన్ వరకు హరీష్ రావు ఆటోలో ప్రయాణించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో 161 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు హరీష్.
‘‘ఆనాడు ఓట్ల కోసం ఆటో ఎక్కావు.. ఓట్లు పడి గద్దె ఎక్కగానే రెండు ఏండ్ల నుండి వీళ్లని మర్చిపోయావా రాహుల్ గాంధీ? రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలియాలని.. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు ఎక్కి ఈ నిరసన కార్యక్రమం చేపడుతుంది. వెంటనే ఆటో కార్మికులకు బాకీ పడ్డ రూ.24 వేలు ఇవ్వాలి’’ అని హరీష్ రావు డిమాండ్ చేశారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల 161 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.. వారి కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మద్యం టెండర్ల ద్వారా ఈ ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లు వచ్చాయి కదా.. అందులో సగం రూ.1500 కోట్లు ఆటో కార్మికులకు ఇచ్చి ఆదుకోండి. ఆత్మహత్య చేసుకున్న 161 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలి. ఆటో సోదరులు ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకోవద్దు.. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఆటో కార్మికులను కాపాడుకుంటాం’’ అని హరీష్ రావు(Harish Rao) తెలిపారు.

