కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీలో స్పీకర్ వైఖరికి నిరసనగా ఈ సెషన్ మొత్తం బైకాట్ చేస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) పేర్కొన్నారు. అసెంబ్లీని గాంధీ భవన్‌గా మార్చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేయొద్దంటూ స్పీకర్ హుకుం జారీ చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం గన్ పార్క్ దగ్గరకు వెళ్లి అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) భాష వీధి రౌడీలా ఉందని పేర్కొన్నారు.
కేసీఆర్ చావు కోరుకుంటారా?
సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ చావును కోరుకుంటారా? అంటూ హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. అసలు ఈ శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారో కూడా ప్రభుత్వానికి క్లారిటీ లేదని ఫైర్ అయ్యారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి తాము అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పలేదని.. అసెంబ్లీలో బజారు భాష మాట్లాడారని హరీశ్ మండిపడ్డారు. అవినీతి గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కమీషన్లు వసూలు చేస్తోందని.. నిర్మాణ సంస్థల దగ్గర నుంచి ఎస్ఎఫ్ టీకి ఇంత ధర పెట్టి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి ఎంత అడ్డగోలుగా మాట్లాడినా స్పందించని స్పీకర్.. తాను మైక్ తీసుకోగానే.. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడొద్దంటూ హుకుం జారీ చేశారని ఆరోపించారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ .. ప్రధాని మోడీ మీద విమర్శలు చేయడం లేదా? అంటూ ప్రశ్నించారు. దేశంలో రాజ్యాంగం అమల్లో లేదని రాహుల్ విమర్శిస్తున్నారని.. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో రాజ్యంగం అమలవుతుందా? అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి మూసీ ప్రక్షాళనకు (Musi Rejuvenation) వ్యతిరేకం కాదని.. అక్కడి నిర్వాసితులను ఆదుకోవాలన్నదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు. మూసీ నిర్వాసితులకు కేసీఆర్ పాలనలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పంచుతున్నారని పేర్కొన్నారు.
Read Also: హైదరాబాద్ మొత్తం మెట్రో విస్తరిస్తాం.. మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన
Follow Us On: Instagram


