కలం, మెదక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కోనుగోలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్‌లో కూర్చొని 80 శాతం నుంచి 90 శాతం వడ్లు కొన్నామని ప్రభుత్వం చెప్తోందని.. కానీ క్షేత్రస్థాయిలో ప్రతి ఊర్లో ఇంకా 30% నుండి 40% వడ్లు పెండింగ్‌లోనే ఉన్నాయని విమర్శించారు. వాతావరణం దారుణంగా ఉందని, వర్షాలు పడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో రైతులు రెండు నెలలుగా వడ్లు అమ్ముకోలేక మిల్లులు, గోదాముల ముందు లారీలతో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సిద్దిపేట నియోజకవర్గం నారాయణ రావు పేట మండల కేంద్రం కు చెందిన రైతు పల్లెవేని కనకయ్య (గద్దర్ ) గుండెపోటుతో మృతి చెందగా మృత దేహానికి హరీశ్ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఒక్క క్వింటాల్ వడ్లు కొనలేదు..
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, వడ్ల కొనుగోలులో జరుగుతున్న అవకతవకల వల్లే నారాయణరావుపేట గ్రామానికి చెందిన కనకయ్య అనే రైతు బలి అయ్యాడని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పంట పండించడం సులభంగా ఉంది కానీ, ఆ పంటను అమ్ముకోవాలంటే రైతులకు కళ్ళల్లో రక్తం వచ్చే పరిస్థితి కనిపిస్తోందన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ నియోజకవర్గమైన అల్లాదుర్గం మండలం వెంకటాపూర్ గ్రామంలో ఇప్పటివరకు ఒక్క క్వింటాల్ వడ్లు కూడా కొనలేదని, ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నాయన్నారు.
తొండల భాష మాట్లాడుతున్న రేవంత్..
సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి సమస్యలు వదిలేసి.. “నేను మళ్ళీ గెలుస్తా, తొక్కుతా, పండబెడతా” అంటూ తొండల భాష, తోతరి భాష మాట్లాడుతున్నారు తప్ప రైతులకు ఏం చేశారో చెప్పడం లేదని దుయ్యబట్టారు. ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని.. రైతుబంధు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. గత 4 నెలల నుండి రాష్ట్రంలో చనిపోయిన రైతులకు రైతుబీమా అందడం లేదని ఆరోపించారు. ధాన్యం కోనుగోళ్లను (Paddy Procurement) అధికారులు, మంత్రులు ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో మాటలు కట్టిపెట్టి ఎలాంటి కోతలు లేకుండా యుద్ధప్రాతిపదికన వడ్లను తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

