కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కొత్తగా 17 కార్పొరేషన్ ఛైర్మన్లను భర్తీ చేయడంపై సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ‘కార్పొరేషన్ పదవులు ఇవ్వడంపై ఉన్న శ్రద్ద, నిధులు విడుదల చేయడంలో లేదు. నిధులు, విధులు లేకుండా కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుంది. కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి ఏం సాధిస్తారు. రేవంత్ రెడ్డికి సంక్షేమంపై దృష్టి కంటే, అనుచరులను సంతృప్తి పరచడం పైనే దృష్టి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 33 కార్పొరేషన్లకు నిధులు కేటాయించడం కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోంది. ఇప్పుడు మరికొందరికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడం హాస్యాస్పదం’ అని విమర్శించారు.
రూ.14 వేల కోట్ల కేటాయింపు, ఖర్చు మాత్రం..
గతంలో నియామకం చేసిన 33 కార్పొరేషన్లకు గాను 21 కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ధ్వజమెత్తారు. ‘నిధులు విడుదల చేయకపోవడంతో, మొదటి దఫాలో నియమితులైన ఛైర్మన్లు ప్రజలకు ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా వారి పదవీకాలాన్ని ముగించారు. మాల, మాదిగ, సంతు సేవాలాల్, కొముం భీం, ఏకలవ్య, మైనార్టీ, ముదిరాజ్, యాదవ, మున్నూరు కాపు, కుమ్మరి, విశ్వ బ్రాహ్మణ, మేదర, వాల్మీకి, బోయ తదితర కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం సిగ్గుచేటు. 33 కార్పొరేషన్లకు గాను ఇప్పటి వరకు 14,521 కోట్లు కేటాయించగా, విడుదల చేసింది 3,198 కోట్లు మాత్రమే అని, వినియోగించింది 305 కోట్లు మాత్రమే.
ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తే, ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు. నిధులు లేని కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించి చేతులు దులుపుకోవడం మానేసి, ఆయా కులాల సంక్షేమం, సమగ్ర అభివృద్ది కోసం నిధులు కేటాయించాలని, వాటిని వినియోగించాలి’ అని డిమాండ్ చేశారు.
Read Also: ఐ ప్యాక్‌తో అఖిలేష్ కటీఫ్!
Follow Us On: WhatsApp

