కలం, వెబ్ డెస్క్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐ-ప్యాక్ (IPAC) సంస్థతో తమ పార్టీ సంబంధాలు తెంచుకోవడానికి గల కారణాన్ని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలకు అందాల్సిన నిధులను బీజేపీ అడ్డుకుంటున్నదని ఆరోపించారు. ఆర్థికపరమైన ఇబ్బందుల వల్లే ఐ-ప్యాక్ సేవలను వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఐ-ప్యాక్ వంటి పెద్ద సంస్థలను నడపడానికి భారీగా నిధులు అవసరమవుతాయన్నారు. అయితే, తమ పార్టీకి వచ్చే ఫండ్స్ సోర్సెస్పై బీజేపీ నిఘా పెట్టిందని ఆరోపించారు. నిధులు రాకుండా అడ్డుపడుతున్నదని మండిపడ్డారు.
ఐ-ప్యాక్.. గతంలో పలు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల విజయాల్లో కీలక పాత్ర పోషించినప్పటికీ.. ఉత్తరప్రదేశ్ రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అఖిలేష్ అభిప్రాయపడ్డారు. భారీ ఖర్చుతో కూడిన బయటి ఏజెన్సీలను నియమించుకోవడం కంటే.. క్షేత్రస్థాయిలో ఉన్న తమ కార్యకర్తలు, నాయకులపైనే నమ్మకం ఉంచడం మేలని తాము భావించినట్లు స్పష్టం చేశారు. కేవలం ఆర్థిక కారణాలే కాకుండా.. పార్టీ అంతర్గత వ్యూహాలు, కార్యకర్తల సమాచారం విషయంలో పూర్తి గోప్యత పాటించాల్సిన అవసరం ఉందని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.

