కలం, వెబ్‌డెస్క్: సిద్ధిపేటలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు చోట్ల క్షేత్ర స్థాయిలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన హరీశ్ రావు అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నారాయణరావు పేట మండల కేంద్రంలో రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు స్వయంగా కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. జాలీలు మార్చాలని, రైతులకు టార్పాలిన్ కవర్లు అందజేయాలని సూచించారు. సరిపడా జాలీలు లేకపోడంపై హరీశ్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ కలెక్టర్ రైతులు ఇన్ని రోజులు పనులు చేసుకోకుండా ఒకేసారి పనులు చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. దీనిపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు ఏం కొత్తగా పండటం లేదని, ప్రభుత్వం ఇప్పుడే కొత్తగా కొనడం లేదని చెప్పారు. మీరు కూడా రైతు బిడ్డనే అని, ఏ ఊరు మిల్లులు ఆ ఊరికి పెట్టాలని. త్వరగా కొనుగోళ్లు చేయాలని చెప్పారు. రెండు మూడు రోజులు చూస్తామని, సరిగ్గా కొనుగోళ్లు జరగకపోతే ఐదు వేల మందితో కలెక్టరేట్ ముందు కూర్చుంటామని హెచ్చరించారు. అక్కడే వంటావార్పు పెట్టుకొని ఎండలో నిరసన తెలిపేందుకు సిద్ధమన్నారు.

