కలం, కరీంనగర్ బ్యూరో: మహాలక్ష్మి పథకంతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బస్ స్టేషన్ ఆధునీకరణకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వేములవాడ, కోరుట్ల మీదుగా బాసరకు ఎక్స్‌ప్రెస్ బస్సును ప్రారంభించారు.
అదనపు బస్సులు కొనుగోలు చేస్తాం..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. ఆర్టీసీలో అదనపు బస్సులు కొనుగోలు చేయడంతో పాటు కొత్తగా నియామకాలు చేపట్టామన్నారు. వేములవాడ బస్టాండ్ 1984లో నిర్మిస్తే.. రూ.1.6 కోట్లతో ఆధునీకరణ చేస్తున్నామని వివరించారు. వేములవాడ నుంచి రోజూ 250 బస్సులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపారు.
అన్ని బస్ స్టేషన్ల ఆధునీకరణ..
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని దేవాలయాలు కొలువైన ప్రాంతాల్లో బస్ స్టేషన్లను ప్రభుత్వం ఆధునీకరిస్తోందన్నారు. తెలంగాణ ఆర్టీసీ విజయవంతంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందిస్తోందని ప్రశంసించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన మేరకు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో వరుణ పూజలు కొనసాగుతున్నాయని అభినందించారు. రైతులు ఆరుతడి పంటలే వేసుకోవాలన్నారు.
రూ.240 కోట్లతో ఆలయ అభివృద్ధి..
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. రూ.240 కోట్లతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. పాదయాత్రలో హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజన్న భక్తులకు మరింత సౌకర్యం ఉండేలా వేములవాడ తిప్పాపూర్ బస్ స్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన చేసుకున్నట్లు వివరించారు.
బస్ స్టేషన్ పక్కన ఉన్న బ్రిడ్జి గతంలో మూడు సార్లు కూలితే. తాము భూ నిర్వాసితులకు లబ్ది చేకూర్చి బ్రిడ్జి పూర్తి చేశామన్నారు. త్వరలోనే ఆలయంలో వరణ యాగం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, మున్నూరు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి.గితే పాల్గొన్నారు.

