జెన్ జీ.. వయా ఇన్‌స్టా.. మోదీ న‌యా ప్లాన్!

కలం, తెలంగాణ బ్యూరో: కాక్రోచ్ ఆందోళనలు కేంద్ర ప్రభుత్వానికి సంకటంగా మారింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా వారి ఉద్యమ కార్యాచరణ లక్షలాదిమందికి చేరడంలో సోషల్ మీడియా ప్రధాన ప్లాట్‌ఫామ్‌గా ఉందని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించుకున్నది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ (ఎక్స్), టెలిగ్రామ్ కంటే ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) ను విస్తృతంగా వాడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్నది. దీంతో యూత్‌కు దగ్గర కావాలంటే ఇన్‌స్టా బలమైన ప్లాట్‌ఫామ్ అని గుర్తించిన ప్రధాని మోదీ (PM Modi).. నీట్ పేపర్ లీక్‌ వ్యవహారంపై అర్ధరాత్రి సోషల్ మీడియాలో ఒక వీడియో మెసేజ్ ఇచ్చారు. ఆ మరుసటి రోజు ‘థాంక్యూ ఫ్రెండ్స్’ అంటూ మరో వీడియో.. రెండురోజులకు ఇంకో వీడియో ఆయన విడుదల చేశారు. ఇవి వ్యూస్‌లో, ఫాలోవర్స్‌లో రికార్డులు సృష్టించాయి.

కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో మే నెలలో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా గంటల వ్యవధిలోనే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు చేరిపోయారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రధాని మోదీ.. జెన్ జీకి చేరువకావాలంటే వయా ఇన్‌స్టానే అని బలంగా నమ్ముతున్నారు. కేబినెట్ భేటీలోనూ ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇన్‌స్టాగ్రామ్‌ వంటి బలమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను వాడి యువతకు చేరువకావాలని సూచించారు. దాదాపు దశాబ్దకాలం నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్‌లను విస్తృతంగా వినియోగించిన బీజేపీ.. ఇక నుంచి అన్నింటికీ ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువగా వాడాలనే నిర్ణయానికి వచ్చింది.

జంతర్ మంతర్ దగ్గర నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నప్పుడు మొబైల్ ఇంటర్‌నెట్‌ సర్వీసులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అయినా వేలాది మంది విద్యార్థులు, యువత ఆ ఆందోళనల్లో కొత్తగా చేరినట్లు పోలీసుల ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలుసుకున్నది. మొబైల్ ఇంటర్‌నెట్‌ కట్ చేసినా.. బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా ఒకరి నుంచి మరొకరు విషయాన్ని షేర్ చేసుకుని సోషల్ మీడియా ద్వారా ఏకమై జంతర్ మంతర్ వద్దకు విద్యార్థులు భారీగా చేరుకున్నట్లు సమాచారం అందుకుంది.

ఇన్ఫర్మేషన్ షేరింగ్‌లో ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌ను వాడినట్లు తెలుసుకున్న ప్రధాని.. ఆ వేదిక ద్వారానే యూత్‌కు రీచ్ కావచ్చని భావిస్తున్నారు. యువత డిమాండ్లను ప్రస్తావిస్తూనే, వారు కన్విన్స్ అయ్యేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఇన్‌స్టాలో వివరించడం మొదలు పెట్టారు. భవిష్యత్తులో రూపొందించనున్న పాలసీని, పార్లమెంట్ సమావేశాల్లో తీసుకురానున్న చట్టాల గురించి కూడా అర్థం చేయిస్తున్నారు. నిరసనలకు ఏ ప్లాట్‌ఫామ్‌ను యూత్‌ వాడుకున్నదో దాని ద్వారానే వారికి దగ్గర కావచ్చని భావించి వీడియో మెసేజ్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌ను మోదీ యూజ్ చేస్తున్నారు.

కేబినెట్ భేటీలోనే మంత్రులకు సూచన

– జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ సక్సెస్ వెనక ఇన్‌స్టాగ్రామ్‌ కీ రోల్‌గా ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఆ ప్లాట్‌ఫామ్‌ను విస్తృతంగా వాడాలంటూ కేంద్ర మంత్రులకు వారం రోజుల క్రితం కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సూచించారు.
– ఇంతకాలం ట్విట్టర్ ద్వారా ఇన్ఫర్మేషన్‌ను షేర్ చేసిన కేంద్ర మంత్రులు ఇన్‌స్టాగ్రామ్ జోలికి వెళ్లలేదు. కానీ, తాజాగా జంతర్ మంతర్ ఎపిసోడ్ నేపథ్యంలో కేంద్ర మంత్రులంతా తప్పనిసరిగా దీన్ని వాడాల్సిందేనని, డిమాండ్లను సాధించుకోడానికి యూత్ వాడుతున్నప్పుడు ఆ యూత్‌కు దగ్గరయ్యేందుకు మనం ఎందుకు వాడకూడదనే లాజిక్‌ను మోదీ అర్థం చేయించారు. ట్విట్టర్ (ఎక్స్) లాంటి సోషల్ మీడియాతో పాటు ఇన్‌స్టాగ్రామ్ సైతం వాడాలని సూచించారు.
– ప్రభుత్వ పాలసీలను, సక్సెస్ స్టోరీలను, లేటెస్ట్ అప్‌డేట్స్‌ను పోస్ట్ చేయాలని మోదీ అన్నారు. యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్న మీమ్స్, షార్ట్ వీడియోస్, రీల్స్, ఇమేజెస్.. ఇలాంటి వాటి రూపంలో యూత్‌కు దగ్గరయ్యేలా ప్రయత్నించాలని తెలిపారు. చెప్పడం వరకే పరిమితం కాకుండా స్వయంగా ప్రధానే వీడియో మెసేజ్‌ల‌ ద్వారా నేతలకు స్ఫూర్తి కలిగించారు.

ఎన్నికల్లోనే ఇదే రూట్..!

కాక్రోచ్ జనతా పార్టీ గంటల వ్యవధిలోనే కోట్లాది మందికి రీచ్ కావడానికి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మారిందని బీజేపీ స్పష్టమైన అభిప్రాయానికి వచ్చింది. జంతర్ మంతర్ నిరసనలు, ప్రభుత్వం ఒక మెట్టు దిగి వారి డిమాండ్లను నెరవేర్చడానికి కూడా అదే ఉపయోగపడిందన్నది ఆ పార్టీ భావన. దేశం నలుమూలల నుంచి ఒక్క దగ్గరికి యూత్‌ను చేర్చిన ఇన్‌స్టా వేదికను తిరిగి వారి మనసులను గెల్చుకోడానికి, వారి అసంతృప్తిని, ఆగ్రహాన్ని అర్థం చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం వాడాలనుకుంటున్నది.

యూత్ డిమాండ్ నీట్ లీకేజ్, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దగ్గరే ఆగిపోదని, భవిష్యత్తులో కొత్త డిమాండ్లతో మళ్లీ ఒత్తిడి పెంచే అవకాశమున్నదని కూడా బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో వారి ఆగ్రహాన్ని కూల్ చేయడానికి సైతం ఇన్‌స్టాగ్రామ్‌నే ప్రధాని, కేంద్ర మంత్రులు వాడాలనుకుంటున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ వాట్సాప్, యూ ట్యూబ్, ఫేస్‌బుక్ కంటే ఇన్‌స్టాగ్రామ్‌నే ఎక్కువగా వాడే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>