Mobile Popup Ad
Mobile Popup Ad

కోటా సాకుతో కొనుగోళ్లు నిలిపివేత.. హరీశ్ రావు ఆగ్రహం

కలం, మెదక్ బ్యూరో :  మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం విధించిన కోటా పేరుతో శనగలు, మక్కలు, జొన్నల కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని ఆయన విమర్శించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట(Sadashivpet) లోని రైతు సేవా కేంద్రాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిసి హరీష్ రావు సందర్శించారు. అక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద వారం రోజులుగా వేచి చూస్తున్న రైతుల సమస్యలను ఆయన స్వయంగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఇంకా సుమారు 60 వేల క్వింటాళ్ల శనగలు రైతుల వద్దనే ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే క్వింటాల్‌కు రూ. 5870 మద్దతు ధర చెల్లించి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులు మార్కెట్‌లో తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వచ్చి, క్వింటాల్‌కు రూ. 1000 వరకు నష్టపోతున్నారని అన్నారు. మక్కజొన్న పరిస్థితి కూడా దారుణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో పంట పండినా, సరైన సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని, సంచులు లేకపోవడం, టోకెన్లు నిలిపివేయడం వంటి సమస్యలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పారు.

మద్దతు ధర రూ. 2400 ఉండగా, రైతులు రూ. 1600-1700కే అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జొన్నల కొనుగోలుపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, దీంతో రైతులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి తక్కువ ధరలకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.  ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి జొన్నలు, సన్‌ఫ్లవర్, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, కోటా పేరుతో ఆపివేసిన శనగల కొనుగోళ్లు వెంటనే పునఃప్రారంభించాలని హరీశ్  రావు డిమాండ్ చేశారు.

Read Also: టైటిల్ కోసం అన్నా చెల్లెళ్ల ఫైట్.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>