కలం వెబ్ డెస్క్: తెలంగాణ నీటి హక్కుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరి రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత హరీష్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం – నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ అర్హత లేని బలహీనమైన పిటిషన్ వేసి, రేవంత్ రెడ్డి తన ద్రోహ బుద్ధిని బయటపెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు.
ఉద్దేశపూర్వక తప్పిదాలతో తెలంగాణకు అన్యాయం
నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం రైతులతో రిట్ పిటిషన్ వేయించి స్టే సాధించిందని హరీష్ రావు గుర్తు చేశారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కావాలనే విచారణకు నిలబడని పిటిషన్ వేసి ఏపీకి మేలు చేస్తోందని ఆరోపించారు. ఈ విషయం రేవంత్ రెడ్డికి, ఆయన తరఫున వాదించే సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి తెలియదా అని నిలదీశారు. కేవలం కాలయాపన చేసి ఏపీ ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకునేలా గడువు ఇవ్వడమే రేవంత్ రెడ్డి అసలు వ్యూహమని హరీష్ రావు విమర్శించారు.
ఢిల్లీ పర్యటనలు.. రహస్య ఒప్పందాలు
నీళ్ల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి (Minister Uttam) సూటు బూటు వేసుకుని ఢిల్లీకి వెళ్లడం వల్ల తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీ మీటింగ్‌లో ఎజెండాలో లేకపోయినా బనకచర్లపై చర్చ జరపడం, కమిటీల ఏర్పాటుకు సంతకాలు పెట్టడం ద్వారా రేవంత్ రెడ్డి తెలంగాణ నదీ జలాలకు మరణశాసనం రాశారని దుయ్యబట్టారు. టెండర్ గడువు ముగిశాక కోర్టుకు వెళ్లడం వెనుక ఉన్న మర్మం ఏంటని ఆయన ప్రశ్నించారు.
పండుగ వేళ..గురువుకి గిఫ్ట్
సంక్రాంతి పండుగ వేళ తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడికి (Chandrababu) రేవంత్ రెడ్డి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఈ బలహీనమైన రిట్ పిటిషనే అని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులపై ఏపీ ప్రభుత్వం అడ్డుకోని ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా అని ప్రశ్నిస్తూ, అలాంటి వారితో దోస్తీ కట్టి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం
తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డిని ఎప్పటికీ క్షమించదని, ముఖ్యమంత్రి తన గురుదక్షిణ కోసం రాష్ట్రాన్ని ద్రోహం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హరీష్ రావు (Harish Rao) స్పష్టం చేశారు. ఈ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, తెలంగాణ నీటి హక్కుల కోసం బిఆర్ఎస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని ఆయన ప్రకటించారు.
Read Also: మున్సి‘పోల్స్’ బరిలో కవిత.. గుర్తు లేకుండా పోటీకి మాస్టర్ ప్లాన్!
Follow Us On: Sharechat


