epaper
Wednesday, February 18, 2026
epaper

కేసులకు భయపడుతున్న సీఎం రేవంత్​ రెడ్డి : హరీశ్​ రావు

కలం, వెబ్​ డెస్క్​ : కేసులకు భయపడి సీఎం రేవంత్​ రెడ్డి ఏపీతో నీటివాటాలపై కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని బీఆర్​ఎస్​ మాజీ మంత్రి హరీశ్​ రావు (Harish Rao) అన్నారు. కృష్ణా నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుపోతున్నవేళ తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, సీఎం ఎ. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుని చోద్యం చేస్తున్నారని విమర్శించారు. కేసులకు భయపడి నీటివాటాలపై కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ 664 టీఎంసీల కృష్ణా జలాలను (సుమారు 80 శాతం) తరలించుకుపోయిందని తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (KRMB)కి రాసిన లేఖలో స్పష్టంగా ఉందని హరీష్ రావు తెలిపారు.

తాత్కాలిక ఒప్పందం (66:34) ప్రకారం ఏపీకి 66 శాతం మాత్రమే వాటా ఉండగా, అది దాటి 80 శాతం వినియోగించుకుందని ఆరోపించారు. జనవరి 28, 2026 నాటికి ఏపీ వాటా దాటేసిందని, వెంటనే బోర్డు మీటింగ్ పెట్టి ఏపీ నీటి దోపిడీని ఆపాలని లేఖలో డిమాండ్ చేశారని చెప్పారు. అయితే KRMB ఏపీకి రాసిన లేఖలో కేవలం 555 టీఎంసీలు మాత్రమే వినియోగించినట్లు పేర్కొంది. దీంతో సుమారు 100 టీఎంసీల తేడా వచ్చిందని, ఇది ఏపీ దోపిడిని కప్పిపుచ్చే ప్రయత్నమని విమర్శించారు. ఈఎన్‌సీ జనవరి 31న రిటైర్ అయిన తర్వాత వారం రోజుల పాటు పోస్టు ఖాళీగా ఉంచారని, ఇది రాష్ట్ర ప్రయోజనాల పట్ల ప్రభుత్వానికి ఆసక్తి లేకపోవడానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ వాటా కేవలం 20 శాతం (సుమారు 174 టీఎంసీలు) మాత్రమే వినియోగించుకుందని, ఇప్పటికీ ఏపీ రోజుకు 1.5 టీఎంసీలు తీసుకుపోతోందని తెలిపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీళ్లు తరలిస్తుంటే ప్రభుత్వం కళ్లు మూసుకుని ఉందని ధ్వజమెత్తారు.

వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ పంటలు, హైదరాబాద్ కు తాగునీరు, పారిశ్రామిక అవసరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, నీటి మంత్రి “గడ్డి పీకుతున్నారా?” హరీశ్​ అని ప్రశ్నించారు. ఈ ఏడాది తెలంగాణలో చరిత్రలో అతి తక్కువ కృష్ణా జలాలు (Krishna Water) వినియోగించారని, రెండు సంవత్సరాలుగా ఇది కొనసాగుతోందన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. “సర్కారు నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా?” అని ప్రశ్నించిన హరీష్ రావు, రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి హక్కులను కాలరాస్తున్నారని, పాలన మీద పట్టు లేదని తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ బీజేపీ నాయకులు కూడా మౌనంగా ఉన్నారని, కాంగ్రెస్-బీజేపీ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ వివాదం తెలంగాణ రైతుల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని హరీష్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.

Read Also: రిటైర్డ్​ ఉద్యోగుల చావుకు కారణం ప్రభుత్వమే : కేంద్రమంత్రి బండి సంజయ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>