ప్రపంచానికి మరో ముప్పు.. హంటా వైరస్ వచ్చేస్తోంది!

కలం, వెబ్ డెస్క్: కొవిడ్ మహమ్మారి బారిన పడి ఆ చేదు జ్ఞాపకాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రపంచాన్ని.. మరో కొత్త వైరస్ భయపెడుతోంది. ఎలుకల నుంచి మనుషులకు సోకుతున్న ఈ కొత్త వైరస్ పేరు ‘హంటా’ (Hanta Virus). ఇటీవలే ఒక క్రూయిజ్ షిప్‌లో ఈ వైరస్ కేసులు బయటపడి.. కొందరు మరణించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే, ఇది కరోనా వంటి మహమ్మారి కాకపోయినా.. జాగ్రత్తలు మాత్రం అవసరమని హెచ్చరిస్తోంది.

ఏంటీ హంటా వైరస్..?

హంటా వైరస్ అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా మనుషులకు సోకే వైరస్. వ్యాధి సోకిన ఎలుకల మూత్రం, మలం, లాలాజల వ్యర్థాలు ఎండిపోయి గాలిలో కలిసినప్పుడు, ఆ గాలిని పీల్చడం ద్వారా మనుషులకు ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. మనిషి నుంచి మరో మనిషికి సోకదని మొదట్లో భావించినా.. క్రూయిజ్ షిప్‌లో ఈ వైరస్ వ్యాప్తి అయిన విధానం పరిశీలిస్తే.. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని WHO అనుమానిస్తోంది. దీనిపై, పరిశోధనలు మరింత ముమ్మరం చేసింది.

ఎలా బయటపడింది..?

‘ఎంవీ. హోండియస్’ అనే క్రూయిజ్ షిప్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఇటీవల ప్రయాణిస్తున్న క్రమంలో.. ఈ వైరస్ వ్యాప్తి చెందడం ప్రారంభమైందని WHO గుర్తించింది. ఏడుగురికి ఈ మహమ్మారి సోకగా.. అందులో ముగ్గురు మరణించారు. మిగిలినవారు చికిత్స తీసుకుంటున్నారు. సాధారణ జనాలకు వచ్చే ముప్పు తక్కువగానే ఉన్నా.. పర్యాటకలు, మరీ ముఖ్యంగా ఎలుకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని WHO హెచ్చరిస్తోంది.

ఏయే దేశాల్లో అధిక ప్రభావం..?

హంటా వైరస్ వివిధ దేశాల పరిస్థితులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది. అందుకే, నిర్దిష్టంగా ఒక రూంలో ఉంటుందని శాస్త్రవేత్తలు సైతం చెప్పలేకపోతున్నారు. అయితే, ప్రస్తుతం దక్షిణ అమెరికా దేశాలైన అర్జెంటీనా, చిలీ, ఉరుగ్వేలో దీని ప్రభావం ఉన్నట్లు గుర్తించారు. వైరస్ వ్యాపించిన ‘ఎంవీ. హోండియస్’ క్రూయిజ్ షిప్ అర్జెంటీనా నుంచే బయలుదేరడంతో.. అక్కడ ‘ఆండీస్ వైరస్’ రకంగా కనిపిస్తోంది. ఇవే గాక అమెరికా, కెనడా, యూరప్, చైనా, రష్యా, కొరియా, కొన్ని యూరోపియన్ దేశాల్లోనూ దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. ఈ దేశాల్లో వైరస్ మూత్రపిండాలపై ప్రభావం చూపే రకంగా కనిపిస్తుందని పసిగట్టారు.

ఎలా ప్రభావం చూపుతుంది..?

హంటా వైరస్ సోకినప్పుడు మనిషికి రెండు రకాల ప్రధాన అనారోగ్యాలు కలగొచ్చు. ఒకటి, హంటా పల్మనరీ సిండ్రోమ్ (HPS), మరొకటి హెమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ (HFRS). ఊపిరితిత్తులు, మూత్రపిండాలపై అధిక ప్రభావం చూపుతాయి. ఈ వైరస్ సోకినప్పుడు ప్రారంభంలో జ్వరం, అలసట, కండరాల నొప్పి, తీవ్రమైన తలనొప్పి, వెన్ను నొప్పి, పొత్తి కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, రక్తస్రావం, తక్కువ రక్తపోటు, కిడ్నీ పాడవడం చోటు చేసుకుంటుంది. దీని కారణంగానే.. మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఎలుకలు తిరిగే ప్రాంతాలను శుభ్రం చేస్తున్నప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలి. ఎలుకల మలమూత్రాలను నేరుగా తాకొద్దు. ఆహార పదార్థాలపై ఎలుకలు రాకుండా మూతలు, ఇతర వస్తువులు పెట్టాలని సూచిస్తున్నారు.

WHO చెప్పిన మరికొన్ని కీలక విషయాలు ఇవి..!

* హంటా వైరస్ ప్రమాదకరమైనదే. ఇది సోకిన వారిలో సుమారు 40 శాతం మంది మరణించే అవకాశం ఉంది. ఆండీస్ అనే హంటా వైరస్ రకం మాత్రమే మనిషి నుంచి మనిషికి వ్యాపించే స్వభావం ఉంది. అయితే, ఇది జరగడం చాలా అరుదు. వైరస్ సోకిన వ్యక్తితో అత్యంత దగ్గర సంబంధం ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అందకే, ఇది కొవిడ్ మాదిరి మహమ్మారిలా మారే అవకాశం చాలా తక్కువగానే ఉంది.

* పరిశోధనల ప్రకారం, అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లు సాధారణంగా వేగంగా వ్యాపించలేవు. ఎందుకంటే రోగులు త్వరగా తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే ఆసుపత్రిలో చేరుతారు. దీంతో, అతను బయటకు వెళ్లడం ఉండదు కాబట్టి, వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశాలు కూడా తక్కువే ఉంటాయి.

* హంటా వైరస్‌తో పోలిస్తే కరోనా భిన్నమైనది. చాలా మంది తమకు వైరస్ ఉందన్న సంగతి తెలియకుండానే బయట తిరిగి ఇతరులకు వ్యాప్తి చెందేలా చేశారు. ఫ్లూ కూడా ఇలానే వ్యాపిస్తుంది. లక్షణాలు తక్కువగా ఉండటంతో ప్రజలు సాధారణ జీవితం కొనసాగిస్తూ వైరస్‌ను ఇతరులకు అంటిస్తుంటారు.

* శాస్త్రవేత్తలు ఎక్కువగా భయపడే వైరస్‌లు చాలా వరకు అత్యంత ప్రాణాంతకమైనవి కావు. అయితే నిశ్శబ్దంగా, తెలియకుండా సులభంగా వ్యాపించే వైరస్‌లే ఎక్కువ ప్రమాదకరం. వీటి ద్వారానే అధిక మరణాలు, తీవ్ర నష్టాలు ఉంటాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>