బంగ్లాదేశ్ చీఫ్ సెలక్టర్‌గా హబీబుల్ బషర్

కలం, వెబ్​ డెస్క్​ : బంగ్లాదేశ్ క్రికెట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. 2027లో ఆఫ్రికా వేదికగా జరగనున్న ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ కోసం జట్టును సిద్ధం చేసే బాధ్యతను ఆ దేశ మాజీ కెప్టెన్ హబీబుల్ బషర్‌ (Habibul Bashar)కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అప్పగించింది. బంగ్లాదేశ్ సెలక్షన్ ప్యానెల్ చైర్మన్‌గా హబీబుల్ బషర్ నియమితులయ్యారు. గతంలో ముగ్గురు సభ్యులతో ఉన్న ఈ కమిటీని ఇప్పుడు నలుగురికి పెంచుతూ బీసీబీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మాజీ చైర్మన్ గాజీ అష్రఫ్ హుస్సేన్ తన ఒప్పందాన్ని పొడిగించుకోవడానికి నిరాకరించడంతో, బోర్డు ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది.

53 ఏళ్ల హబీబుల్ బషర్‌ (Habibul Bashar)కు సెలక్టర్‌గా సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన గతంలో 11 ఏళ్ల పాటు పురుషుల జట్టుకు, మరో ఏడాది మహిళల జట్టుకు సెలక్టర్‌గా పనిచేశారు. టెస్ట్ క్రికెట్‌లో 3000 పరుగులు చేసిన తొలి బంగ్లాదేశీగా గుర్తింపు పొందిన బషర్, తన కెరీర్‌లో 18 టెస్టులు, 69 వన్డేలకు సారథ్యం వహించారు. బషర్‌తో పాటు ఈ ప్యానెల్‌లో మాజీ పేసర్ హసిబుల్ హుస్సేన్ కొనసాగుతున్నారు. వీరితో పాటు కొత్తగా నయీమ్ ఇస్లాం, నదీఫ్ చౌదరిలను బోర్డు ఎంపిక చేసింది.

39 ఏళ్ల నయీమ్ ఇస్లాంకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధికంగా 34 సెంచరీలు చేసిన రికార్డు ఉంది. ఆయన తన రెండు దశాబ్దాల కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 20 వేలకు పైగా పరుగులు సాధించారు. మరో సభ్యుడు నదీఫ్ చౌదరి కూడా 20 ఏళ్ల క్రికెట్ అనుభవం ఉన్న ఆటగాడు. గతేడాది నుంచి ఆయన బీసీబీలో ఏజ్ గ్రూప్ సెలక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>