కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad) నగరంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ సిలిండర్ల కొరత (Fuel Shortage) లేదని, తగినంత స్టాక్ అందుబాటులో ఉందని నగర సీపీ సజ్జనార్ (Sajjanar) స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. నగరవ్యాప్తంగా ఇంధన సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేవని పేర్కొన్నారు. ప్రజలు అనవసరంగా భయాందోళనలకు గురై పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు తీయవద్దని, అలా చేయడం వల్ల అనవసర ట్రాఫిక్ జామ్ ఏర్పడి జన జీవనానికి ఇబ్బంది కలుగుతుందని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుత పరిస్థితులను పోలీసు యంత్రాంగం ఇతర సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తోందని కమిషనర్ తెలిపారు. ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని కోరారు. సాధారణ పరిస్థితులు నెలకొనేలా అధికారులకు సహకరించాలని, నిబంధనలు పాటించి నగరంలో శాంతిభద్రతలను కాపాడాలని ఆయన తన పేర్కొన్నారు.
ఇక సజ్జనార్ (Sajjanar) చేసిన పోస్టుకు నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎక్కడో కూర్చొని పోస్టు పెట్టడం కాదు సార్, వచ్చి క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూడండి అని ఒకరు కామెంట్ చేశారు. ఇక గ్యాస్ బుక్ చేసి 15 రోజులు దాటినా ఇంకా రాలేదని మరో ఇద్దరు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరత లేకపోతే హోటళ్లలో టిఫిన్స్ ధరలు ఎందుకు పెంచారని ఒకరు ప్రశ్నించారు. ఇక కొందరు ఇంధన కొరత లేకపోతే పెట్రోల్ బంకులు ఎందుకు మూత పడుతున్నాయని ప్రశ్నించారు. ఒక నెటిజన్ అయితే కమిషనర్‌గా మీ డ్యూటీ ప్రజలకు రక్షణ కల్పించడమే కానీ, ఇలా ఇంధన సరఫరాపై సర్టిఫికెట్లు ఇవ్వడం కాదని పేర్కొన్నారు.
Read Also: కొత్త వాహనాల కొనుగోలుపై భారీ రాయితీలు : మంత్రి పొన్నం
Follow Us On: Instagram

