కలం, నల్లగొండ బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిదని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) తెలిపారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ భాను శ్రీ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకు గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) మాట్లాడుతూ.. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సందర్భంగా గత 2 సంవత్సరాలలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్దిని ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తీర్చేందుకు ప్రజలు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ విడతన ఇదివరకే బేస్మెంట్ వేసుకున్న వారికి, పిల్లర్లు వేసుకున్న వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు గుత్తా వెల్లడించారు.
ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం గడచిన 2 సంవత్సరాలుగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి వివిధ రకాల కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్ ,సన్న బియ్యం, తదితర పథకాలను 6 గ్యారంటీలను అమలు చేస్తున్నదని తెలిపారు. ఇంకా చాలామంది అర్హులైన వారికి రేషన్ కార్డులు రావాల్సి ఉందని.. వాటిని కూడా ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, తహసిల్దార్ విజయ, ఎంపీడీవో జయలక్ష్మి, గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: రికార్డు ధర పలికిన రవివర్మ పెయింటింగ్.. ఎన్ని కోట్లంటే..?
Follow Us On : WhatsApp

