కలం, నల్లగొండ బ్యూరో: పేదరికాన్ని పారదోలేది విద్య మాత్రమే అని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. దేవరకొండ పట్టణ శివారులో కొల్‌ముంతల్ పహాడ్ గ్రామం వద్ద రూ.250 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న గురువారం “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్” నిర్మాణ పనులకు శంకుస్థాపన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌తో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్థాపన ఒక విప్లవాత్మక నిర్ణయమని కొనియాడారు. ఈ పాఠశాలల ద్వారా నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి వసతులు, విద్య అందుతాయని, దీనివల్ల వేలాది కుటుంబాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
త్వరలోనే ఎస్సెల్బీసీ పనులు పూర్తి..
దేవరకొండ, మునుగోడు ప్రాంతాల ప్రజల చిరకాల స్వప్నమైన ఎస్సెల్బీసీ సొరంగం పనులు త్వరలోనే పూర్తవుతాయని మండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా ఈ ప్రాంతం త్వరలోనే పచ్చని పంటలతో కళకళలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఎక్కడా ఆపడం లేదని స్పష్టం చేశారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారని అభినందించారు. దేవరకొండ నియోజకవర్గంపై తనకు ప్రత్యేక అభిమానం ఉంటుందని.. ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) పునరుద్ఘాటించారు.
Read Also: మంచి మనసు చాటుకున్న వీహెచ్.. జీతం మొత్తం పేద విద్యార్థులకే!
Follow Us On: Instagram

