కలం, నిర్మల్: నిర్మల్(Nirmal) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజల సౌకర్యార్థం లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన మూత్రశాలలు ఐదేళ్లుగా నిరుపయోగంగా మారాయి. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి ప్రధాన ప్రవేశ ద్వారం సమీపంలో నిర్మించిన ఈ మూత్రశాలలు నేటికీ వినియోగంలోకి రాకపోవడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మూత్రశాలల నిర్మాణ సమయంలో వ్యర్థాలు బయటకు వెళ్లేందుకు సెప్టిక్ ట్యాంకుతో సరైన అనుసంధానం ఏర్పాటు చేయకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన సౌకర్యాలు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. ఆసుపత్రికి ప్రతిరోజూ వందలాది మంది రోగులు, వారి బంధువులు వస్తుంటారు. అయితే కనీస మూత్ర విసర్జన సౌకర్యం కూడా అందుబాటులో లేకపోవడంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మరోవైపు కొందరు ఆసుపత్రి పరిసరాల్లోనే మూత్ర విసర్జన చేస్తుండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఐదేళ్లుగా సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని సెప్టిక్ ట్యాంకు అనుసంధాన సమస్యను పరిష్కరించి, మూత్రశాలలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.

