కలం మెదక్ బ్యూరో: సిద్ధిపేట (Siddipet) జిల్లా తొగుట వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట రైతులతో కలిసి బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. గత 15 రోజులుగా పొద్దు తిరుగుడు పంట కొనుగోలు చేయకపోవడంతో పాటు, మొక్కజొన్న కొనుగోళ్లు నత్త నడకన సాగడంపై నిరసన వ్యక్తం చేస్తూ నల్ల జెండాలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. తొగుట మార్కెట్ యార్డులో గత 15 రోజులుగా కోనుగోళ్లు చేయకపోవడంతో టన్నుల కొద్ది పొద్దు తిరుగుడు పంట మార్కెట్‌లో పేరుకు పోయిందని, 4,900 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేసినా ఒక్క పైసా కూడా రైతులకు చెల్లించలేదన్నారు.
పంటను అమ్ముకొనేందుకు రైతులు మండు టెండల్లో మార్కెట్‌లో అష్ట కష్టాలు పడుతున్నారని, రైతుల పంటలను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి రైతు సమస్యలపై ముందు చూవు కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడ్డారని, యూరియా కావాలంటే యాప్ ఇచ్చారని విమర్శించారు. కొనుగోలు అలస్యం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నరని, వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

