కలం, వెబ్ డెస్క్ : ఇరాన్‌పై సైనిక చర్య (Iran War)ను ముగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని సన్నిహితుల వద్ద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) వ్యాఖ్యానించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ రాసుకురావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న సైనిక చర్య ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ క్లైమాక్స్‌కు చేరుకుందనే వార్తల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు రంగంలోకి దిగాయి. ఇరాన్ ఓడిపోయేవరకు యుద్ధం కొనసాగించాలని గల్ఫ్ దేశాలు కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పాలనాయంత్రాంగం పూర్తిగా కూలిపోయేవరకు యుద్ధం ముగించవద్దని, ఆ దేశపు మత గురువుల పాలనను శాశ్వతంగా దెబ్బతీసేందుకు ఇది ఒక చారిత్రక అవకాశమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ దేశాలు కోరాయని అసోసియేటెడ్ ప్రెస్ సంచలన కథనం వెల్లడించింది.
యుద్ధంపై తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని మొదట గల్ఫ్ దేశాలు (Gulf Countries) అలిగాయి. కానీ ఇప్పుడు అవే దేశాలు ఇరాన్ ను వదిలిపెట్టొద్దని కోరడం గమనార్హం. నెల రోజులుగా జరుగుతోన్న యుద్ధంలో ఇరాన్ చెప్పుకోదగ్గ స్థాయిలో బలహీనపడలేదని.. ఇరాన్ నాయకత్వంలో గణనీయమైన మార్పు రావాలని, అప్పటివరకు సైనిక చర్య ముగియకూడదని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, బహ్రెయిన్ దేశాలు ట్రంప్ కు సూచించాయట. కేవలం గగనతల దాడులతో సరిపెట్టకుండా, ఇరాన్‌పై నేరుగా భూతల దాడి చేయాలని తెలిపాయి. యుద్ధాన్ని ఆపేస్తే.. ఇరాన్ మళ్లీ పుంజుకుంటుందని, అది అరబ్ దేశాల భద్రతకు ఏ మాత్రం మంచిది కాదని వాదించాయని సమాచారం అందుతోంది.
కాగా, గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా ఆర్మీ బేస్ లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు (Iran War) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్ తమ ప్రజలపై కూడా దాడి చేస్తున్నట్లు పలు గల్ఫ్ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా తన యుద్ధాన్ని కొనసాగించాలని గల్ఫ్ దేశాలు కోరడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈ తాజా పరిణామంతో గల్ఫ్ దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొంటాయా? లేదా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) నిలిపివేయడంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు గల్ఫ్ దేశాల విన్నపాలకి ట్రంప్ తలొగ్గి యుద్దాన్ని పొడిగిస్తే.. అది ఎలాంటి ఉపద్రవాలకు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
Read Also: ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్.. ట్రంప్ సంచలన నిర్ణయం!
Follow Us On : WhatsApp

