కలం, నిజామాబాద్ బ్యూరో : వచ్చే ఏడాది జూలైలో అట్టహాసంగా జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేయాలని నిజామాబాద్(Nizamabad) కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత శాఖల అధికారులతో కలసి కందకుర్తి పుష్కర ఘాట్‌ను (Kandakurti Pushkar Ghat) పరిశీలించారు. కొన్ని రోజుల క్రితం కూడా పుష్కర ఘాట్‌ను సందర్శించి, అధికారులు చేపట్టిన పనులను తన కళ్లతో తనిఖీ చేసిన కలెక్టర్, ఘాట్ పరిసరాల పనులను మరింత పునఃసమీక్షించారు.
ఘాట్‌కు (Kandakurti Pushkar Ghat) వచ్చే మార్గాలలో రహదారుల మరమ్మతులు, విస్తరణ, శివాలయం వద్ద జరుగుతున్న పనులు తదితరాలను పరిశీలించిన కలెక్టర్, భక్తుల సౌకర్యాల కోసం ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. పుష్కరాల సమయంలోనే కాక, సాధారణ రోజుల్లో కూడా భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచి పరిసరాల పరిశుభ్రత, కనీస వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. త్రివేణి సంగమ ప్రాంతంగా కందకుర్తి పుష్కర ఘాట్ ఉన్నందున, ఘాట్ వద్ద లక్షలాది భక్తులు పుణ్య స్నానాలకు రావచ్చని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. రాకపోకలకు ఆటంకం రాకుండా, అవసరమైతే మార్గాల్లో కల్వర్టుల నిర్మాణం కూడా చేపట్టాలని చెప్పారు.
విఐపీల కోసం హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, భక్తుల వసతికి షామియానాలు వంటి అన్ని ఏర్పాట్లు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలనీ కలెక్టర్ ఆదేశించారు. ఘాట్ వద్ద ప్రమాదాలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మరొకసారి గుర్తు చేశారు. కలెక్టర్ ముందుగా కందకుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెంజల్ మండల అధికారులతో సమావేశం నిర్వహించి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, జనాభా గణన వంటి కార్యక్రమాలపై కీలక సూచనలు ఇచ్చారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహ, దేవాదాయ శాఖ అధికారులు కమల, విజయరామారావు, తహసిల్దార్ శ్రవణ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ తదితర అధికారులు ఉన్నారు.
Read Also: వరంగల్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ గురి.!
Follow Us On : WhatsApp

