కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద మంగళవారం తెల్లవారుజామున ఏటీఎం చోరీ(ATM Robbery) ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దొంగల ముఠా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎంను ధ్వంసం చేసి యంత్రాన్ని పూర్తిగా ఎత్తుకెళ్లారు. తెలంగాణ చౌరస్తా సమీపంలో రాఘవేంద్ర సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్న దుండగులు ముందుగా అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం ఏటీఎం యంత్రాన్ని పగలగొట్టి బొలోరో వాహనంలో తీసుకెళ్లారు. ఉదయం ఘటన వెలుగులోకి రావడంతో బ్యాంకు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటీవల షాద్‌నగర్‌లో జరిగిన ఏటీఎం దొంగతనంలో పాల్గొన్న ముఠానే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం సహకారంతో సీసీటీవీ ఫుటేజ్‌లు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ జానకీ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సీసీటీవీ దృశ్యాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 2:25 గంటల సమయంలో దొంగలు బొలోరో వాహనంలో వచ్చి ఏటీఎంను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. తరువాత హన్వాడ మండలంలోని కొత్తపేట సమీపంలో ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదును దోచుకెళ్లినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల ముఠా కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

